తదుపరి రాష్ట్రపతి ఎవరు? తేల్చనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు!

  • ఇక్కడ మొత్తం 690 స్థానాలు
  • గతంలో బీజేపీకే అత్యధికం
  • ఈ సారి కూడా బలం నిరూపించుకోవాల్సిందే
  • ప్రతిపక్షాలది పైచేయి అయితే పోటీయే
తదుపరి భారత రాష్ట్రపతిని నిర్ణయించే అంశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు కీలక పాత్ర పోషించనున్నాయి. రాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ ఓట్లు కీలకం. ఫిబ్రవరి, మార్చిలో జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో మొత్తం 690 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి గెలుపొందే ఎమ్మెల్యేలకు కూడా ఓటు హక్కు ఉంటుంది. కనుక యూపీ, ఉత్తరాఖండ్ లో బీజేపీ గతంతో పోలిస్తే బలహీనపడితే అది రాష్ట్రపతి అభ్యర్థి భవితవ్యాన్ని తేల్చనుంది.

2017 నాటి ఎన్నికల్లో యూపీలో 403 సీట్లకు గాను బీజేపీ 325 చోట్ల గెలుపొందింది. ఉత్తరాఖండ్ లో 70 స్థానాలకు గాను 57 సొంతం చేసుకుంది. దీంతో నాడు రాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీకి ఎదురే లేకపోయింది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత రాజ్యసభలో పార్టీల ప్రాతినిధ్యంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు. బీజేపీ తక్కువ స్థానాలకు పరిమితమైతే ప్రతిపక్షాలకు బలం పెరుగుతుంది. దీంతో ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని పోటీ పెట్టే అవకాశం ఏర్పడుతుంది. కనుక ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి ప్రతిష్ఠాత్మకం కానున్నాయి.


More Telugu News