కరోనా మృతులపై తెలంగాణ సర్కారు అంకెలు వేరు.. వాస్తవాలు వేరు..!

  • జనవరి 7 నాటికి మృతులు 4,039
  • పరిహారం కోసం వచ్చిన దరఖాస్తులు 26,000
  • రికార్డులకు ఎక్కని మరణాలు చాలానే ఉన్నాయ్
  • ఆసుపత్రికి తరలిస్తుండగా బలైన వారు ఎందరో
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కు బలైపోయిన వారి విషయంలో అధికారిక లెక్కలకు, వాస్తవాలకు పొంతన కుదరడం లేదు. సాధారణంగా ఇటువంటి అంశాల్లో నిజా, నిజాలు ఏంటన్నవి బయటకు రావు. కానీ, కరోనా విపత్తు విషయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంబంధించి ప్రభుత్వం రూ.50,000 పరిహారం ఇస్తుండడంతో వాస్తవ మృతుల సంఖ్య వెలుగులోకి వస్తోంది. దీంతో సర్కారు వారి లెక్కల కంటే చనిపోయిన వారు ఐదారు రెట్లు ఎక్కువే ఉన్నట్టు తెలుస్తోంది.

కరోనాతో 7వ తేదీ నాటికి తెలంగాణలో 4,039 మంది చనిపోగా.., జనవరి 7 నాటికి కొవిడ్ పరిహారం కోరుతూ 26,000 దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. వీటిలో 12,000 దరఖాస్తులకు జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన గల కమిటీలు ఆమోదం తెలిపినట్టు చెప్పారు.

ప్రతీ సోమవారం అప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకుని, జిల్లాలోని కమిటీలు వాటిపై నిర్ణయం తీసుకుంటున్నట్టు బొజ్జా తెలిపారు. ఎక్స్ గ్రేషియా నిబంధనలను సడలించడం వల్ల అధిక దరఖాస్తులు వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

బాధితుల కుటుంబ సభ్యులు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చనిపోయిన వారి మరణ ధ్రువీకరణ పత్రం, మరణానికి ముందు కొవిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్టుగా రిపోర్ట్, ఆధార్, దరఖాస్తు దారు ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్ ఉంటే అప్లికేషన్ ను ఆమోదిస్తున్నట్టు అధికారులు బెబుతున్నారు.

ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించిన వారు, ఆస్పత్రికి తీసుకెళ్లిన వెంటనే ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు రికార్డుల్లోకి రాకపోవడమే దరఖాస్తులు ఎక్కువగా ఉండడానికి కారణంగా అధికారులు అంటున్నారు. సర్కారు వారి మృతుల లెక్కలకు మించి మరణాలు ఉన్నట్టు నిర్ధారణ అవుతోంది.


More Telugu News