వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికే లోకల్ రైలు టికెట్లు... సదరన్ రైల్వే కీలక నిర్ణయం

  • తమిళనాడులో భారీగా కరోనా కేసులు
  • వ్యాప్తి నివారించేందుకు రైల్వే శాఖ కొత్త నిబంధన
  • వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపిస్తేనే రైలు టికెట్లు
  • మొబైల్ లో టికెట్లు కొనడం కుదరదని వెల్లడి
దేశంలో మరోసారి కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే కొత్త కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సదరన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని నివారించే క్రమంలో, కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికే చెన్నై లోకల్ రైళ్లలో ప్రయాణానికి టికెట్లు ఇస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయం జనవరి 10 నుంచి 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. రెండు డోసులు తీసుకోని వారిని లోకల్ రైళ్లలో ప్రయాణానికి అనుమతించబోమని స్పష్టం చేసింది.

టికెట్ కొనుగోలు చేసే సమయంలో ప్రయాణికులు వ్యాక్సినేషన్ పూర్తయినట్టు సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుందని దక్షిణ రైల్వే వివరించింది. ఈ నిబంధనలో ఎలాంటి సడలింపులు ఉండబోవని, సీజన్ టికెట్ తీసుకునేవారికి కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది. జనవరి 10 నుంచి 31వ తేదీ వరకు మొబైల్ ఫోన్లలో అన్ రిజర్వ్ డ్ టికెటింగ్ సిస్టమ్ (యూటీఎస్) అందుబాటులో ఉండదని కూడా వెల్లడించింది.

తమిళనాడులో భారీగా కరోనా కేసులు వస్తుండడం తెలిసిందే. శుక్రవారం నాడు ఒక్కరోజే 8,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 121 ఒమిక్రాన్ కేసులను కూడా గుర్తించారు.


More Telugu News