కోహ్లీపై ఆస్ట్రేలియా వెబ్‌సైట్ విమ‌ర్శ‌లు.. కౌంట‌ర్ ఇచ్చిన వ‌సీం జాఫ‌ర్

  • కోహ్లీ స‌గ‌టుపై ఆస్ట్రేలియా వెబ్‌సైట్ పోస్టు
  • 2019 నుంచి టెస్టుల్లో స్టార్క్‌ సగటు 38.63
  • బ్యాట్స్‌మన్‌ కోహ్లీ సగటు 37.17 ఉంద‌ని వ్యాఖ్య‌
  • ఆసీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మ‌న్‌ స్టీవ్‌స్మిత్ స‌గ‌టు 43.44 అని చెప్పిన వ‌సీం
  • నవ్‌దీప్‌ సైని వన్డే కెరీర్‌ బ్యాటింగ్‌ సగటు 53.50గా ఉందని చుర‌క‌
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ కొంత కాలంగా బ్యాటింగ్‌లో స‌రిగ్గా రాణించ‌లేక‌పోతుండ‌డంతో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వెబ్‌సైట్ ఈ విష‌యాన్ని పేర్కొంటూ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. కోహ్లీ బ్యాటింగ్‌ సగటును ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్ స్టార్క్‌తో పోల్చుతూ, స్టాట్‌ ఆఫ్‌ ది డే అని పేర్కొంది.  

2019 నుంచి టెస్టుల్లో స్టార్క్‌ సగటు 38.63 ఉండ‌గా, బ్యాట్స్‌మన్‌ కోహ్లీ సగటు 37.17 ఉంద‌ని చెప్పింది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను కూడా  ట్వీట్‌ చేసింది. దీనిపై స్పందించిన టీమిండియా మాజీ క్రికెట‌ర్ వ‌సీం జాఫర్‌ తనదైన శైలిలోనే రిప్లై ఇచ్చారు. టీమిండియా యువ పేసర్‌ నవ్‌దీప్‌ సైని వన్డే కెరీర్‌ బ్యాటింగ్‌ సగటు 53.50గా ఉందని, ఇది ఆసీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మ‌న్‌ స్టీవ్‌స్మిత్ స‌గ‌టు 43.44 కన్నా ఎక్కువ‌ని చెప్పారు.

ఆయ‌న స‌మ‌య‌స్ఫూర్తిపై నెటిజన్లు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియా వెబ్‌సైట్ తీరుపై మండిప‌డుతున్నారు. వసీం జాఫర్‌ సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి పోస్టులు చేయ‌డంలో ముందుంటారు. ప్ర‌తిరోజు తనదైన శైలిలో మీమ్స్‌ పోస్టు చేస్తుంటారు.

ఇదిలావుంచితే, గత రెండేళ్లుగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స‌రిగ్గా చేయలేక ఇబ్బందులు ప‌డుతున్నాడు. ఆయ‌న‌ 2019, నవంబర్‌లో కోల్‌కతా వేదికగా జరిగిన డే/నైట్‌ టెస్టులో బంగ్లాదేశ్‌పై చివరిసారి సెంచ‌రీ చేశాడు. అప్పటి నుంచి విరాట్‌ ఇప్పటివరకు సెంచ‌రీ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆయ‌న‌ బ్యాటింగ్‌ సగటు త‌గ్గిపోయింది.


More Telugu News