'సార్' అంటూ దగ్గరకెళితే.. మణిరత్నంగారు అలా అనడంతో బాధ పడ్డాను: దర్శకుడు సుకుమార్

  • నా అభిమాన దర్శకుడు మణిరత్నం
  • 'గీతాంజలి' సినిమాను మరిచిపోలేను
  • ఆయన వల్లనే డైరెక్టర్ అయ్యాను
  • ఆయనను కలవాలన్న సుక్కూ
టాలీవుడ్ దర్శకులలో సుకుమార్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మణిరత్నం గురించి ప్రస్తావించారు. "నేను మణిరత్నంగారి అభిమానిని .. ఆయన 'గీతాంజలి' సినిమాను చూసిన తరువాత ఆ థియేటర్ లో నుంచి బయటికివస్తూ, ఒక గర్ల్ ఫ్రెండ్ ని వదిలేసి వస్తున్నట్టుగా బాధపడ్డాను. అలాంటి ఆయనను కలవడం ఇంతవరకూ కుదరలేదు.

మణిరత్నంగారి  ప్రభావం వల్లనే నేను దర్శకుడినయ్యాను. 'ఆర్య' సినిమా చేసిన తరువాత ఒకసారి ఆయన ముంబైలో తారసపడ్డారు. ఆ సమయంలో ఆయన హీరోయిన్ శోభనతో సీరియస్ గా ఏదో డిస్కస్ చేస్తున్నారు. చాలా సేపు వెయిట్ చేసినప్పటికీ, వాళ్ల సంభాషణ పూర్తి కావడం లేదు. దాంతో ఇక ఉండలేక .. 'సార్' అంటూ ఆయన దగ్గరికి వెళ్లాను. అప్పుడాయన కోపంగా నా వైపు చూస్తూ 'వెళ్లూ' అన్నట్టుగా చేయితో సంజ్ఞ చేశారు.

నేను ఎంతగానో అభిమానించే మణిరత్నంగారు అలా అనడం నా మనసుకు చాలా బాధను కలిగించింది. అయితే, ఒక డైరెక్టర్ సీరియస్ గా డిస్కస్ చేస్తున్న సమయంలో డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుందనేది నాకు ఆ తరువాత అర్థమైంది. అప్పటి ఆయన ధోరణి నాకు తప్పుగా అనిపించలేదు. అప్పటి నుంచి ఆయనను కలిసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.


More Telugu News