ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తా: ర‌ఘురామ‌కృష్ణ రాజు సంచ‌ల‌న‌ ప్ర‌క‌ట‌న‌

  • నాపై అనర్హ‌త వేటు వేయాల‌ని చూస్తున్నారు
  • వైసీపీ నుంచి తొల‌గించాల‌ని ప్ర‌య‌త్నించినా కుద‌ర‌లేదు
  • ఏపీకి ప‌ట్టిన ద‌రిద్రం వ‌ద‌లాలి
  • రాజ‌ధానిగా అమ‌రావ‌తి కోస‌మే రాజీనామా
త్వ‌ర‌లో ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని వైసీపీ అసంతృప్త నేత‌ ర‌ఘురామ‌కృష్ణ రాజు ప్రకటించారు. ఈ రోజు ఢిల్లీలో ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడుతూ... త‌న‌పై అనర్హ‌త వేటు వేయాల‌ని చూస్తున్నార‌ని చెప్పారు. త‌న‌ను వైసీపీ నుంచి తొల‌గించాల‌ని ప్ర‌య‌త్నించినా ఆ పార్టీ నేత‌ల ప్ర‌య‌త్నాలు సాధ్యం కాలేద‌ని చెప్పారు. ఏపీకి ప‌ట్టిన ద‌రిద్రాన్ని వ‌దిలించేందుకే రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని చెప్పారు.

రాజ‌ధానిగా అమ‌రావ‌తిని కొన‌సాగించాల‌నే డిమాండ్ కోసమే ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని వివ‌రించారు. త‌న‌పై అనర్హ‌త వేటు వేయ‌క‌పోయినా తానే రాజీనామా చేస్తాన‌ని చెప్పారు. రాజీనామా చేసి ఎన్నిక‌ల‌కు వెళ్తాన‌ని తెలిపారు. వైసీపీపై ప్ర‌జ‌ల్లో ఎంత వ్య‌తిరేక‌త ఉంద‌న్న విష‌యాన్ని ఉప ఎన్నిక ద్వారా తెలియ‌జేస్తాన‌ని అన్నారు.

త‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయిస్తామ‌ని వైసీపీ నేత‌లు అంటున్నార‌ని, వారు అన‌ర్హ‌త వేటు వేయిస్తారేమోన‌ని ఇన్నాళ్లు ఎదురు చూశాన‌ని చెప్పారు. అయితే, త‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయించ‌లేక‌పోతోన్న వైసీపీ నేత‌ల‌ను చూసి త‌న‌కే జాలి వేసింద‌ని ఎద్దేవా చేశారు. మున్ముందు ఏం జ‌రుగుతుందో చూద్దామ‌ని చెప్పారు.

కాగా, ఏపీలో అన్ని రంగాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ర‌ఘురామ‌కృష్ణ‌రాజు అన్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగులు చేసిన త‌ప్పు ఏమిటి? అని ఆయన నిల‌దీశారు. వారిని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ప్ర‌శ్నించారు. పీఆర్సీపై ఏపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు స‌రికాదని చెప్పారు.

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులూ ముందుకు వెళ్ల‌డం లేవ‌ని ర‌ఘురామ‌కృష్ణ‌రాజు విమర్శించారు. పోల‌వ‌రం ఎందుకు పూర్తి కావ‌ట్లేదంటే కేంద్ర ప్ర‌భుత్వం నిధులు ఇవ్వ‌డం లేద‌ని కేంద్రంపై ఆ నింద వేస్తున్నార‌ని చెప్పారు. మ‌రి రాష్ట్రంలో పూర్తి కావాల్సిన మిగ‌తా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కావ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో చాలా మందిపై అక్ర‌మంగా కేసులు పెడుతున్నార‌ని ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఆరోపించారు. ప్ర‌శ్నించే గొంతుల‌ను తొక్కేస్తున్నార‌ని చెప్పారు. జ‌గ‌న్ తీరులో మార్పు రావాల‌ని చెప్పారు.


More Telugu News