ఒమిక్రాన్ తర్వాత వచ్చే రకం మరింత తీవ్రంగా ఉండొచ్చు: కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీంద్రగుప్తా

  • పరిణామ క్రమంలో పొరపాటు వల్లే బలంగా లేదు
  • మళ్లీ పూర్వపు స్థితికి వెళ్లొచ్చు
  • వైరస్ ను కట్టడి చేయడమే కర్తవ్యం కావాలి
  • వైరస్ బారిన పడడం సహజ టీకా కాదు
  • ఆరోగ్యంపై ఎన్నో దుష్ప్రభావాలు
కరోనా ఒమిక్రాన్ రకం బాధితుల ఆరోగ్యంపై గతంలో మాదిరి పెద్ద ఎత్తున ప్రభావం చూపించడం లేదని చాలా కేసుల్లో స్పష్టమవుతోంది. దీంతో ఇక కరోనా వైరస్ బలహీనపడిపోయినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ, ఒమిక్రాన్ తదుపరి వేరియంట్ మరింత తీవ్ర స్థాయిలో ఉండొచ్చని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో క్లినికల్ మైక్రోబయాలజిస్ట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న భారత సంతతి వైద్యనిపుణుడు రవీంద్ర గుప్తా అంటున్నారు.

ఒమిక్రాన్ పై ఒక అధ్యయనానికి గుప్తా నేతృత్వం కూడా వహించారు. ‘‘వైరస్ కాలక్రమేణా మరింత బలహీనంగా (హాని చేయని స్థితికి) మారుతుందన్న భావన ఉంది. కానీ, ఇక్కడ అలా ఏమీ జరగడం లేదు. ఇవన్నీ దీర్ఘకాల పరిణామక్రమ ధోరణులు. సార్స్ కోవ్ 2 చాలా ప్రభావవంతమైనది. కనుక ఇక ఇది తేలికపాటిగా మారిపోతుందనడానికి ఎటువంటి ఆధారం లేదు.

అందుకే ఒమిక్రాన్ వేరియంట్ ను పరిణామ క్రమంలో జరిగిన పొరపాటుగా చెబుతున్నాను. ఒమిక్రాన్ లో తీవ్రత తగ్గడం సంతోషమే. కానీ తదుపరి వేచ్చే రకం పూర్వపు మాదిరే ప్రభావవంతంగా ఉండొచ్చు. కనుక వైరస్ ను నిరోధించడమే ముఖ్యం కావాలి. కానీ, వైరస్ బారిన పడడం సహజ టీకాగా ప్రజలు భావిస్తుండటం సరికాదు. ఆరోగ్యంపై భిన్న వైరస్ రకాలు చూపించే దుష్ప్రభవాల గురించి మనం అర్థం చేసుకోవడం లేదు’’ అని రవీంద్ర గుప్తా వివరించారు.


More Telugu News