వనమా రాఘవను అరెస్ట్ చేయలేదు.. ఆయన కోసం ఇంకా గాలిస్తున్నాం: పాల్వంచ ఏసీపీ

  • కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు
  • బాధితుడి సెల్ఫీ వీడియోలు వెలుగులోకి వచ్చాక అదృశ్యం
  • అరెస్ట్ వార్తలను ఖండించిన పోలీసులు
  • బెయిలు కోసం ప్రయత్నిస్తే కౌంటర్ దాఖలు చేస్తామన్న ఏసీపీ రోహిత్ రాజు
ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును అరెస్ట్ చేసినట్టు వస్తున్న వార్తలను పోలీసులు కొట్టిపడేశారు. ఆయన ఇంకా పోలీసులకు చిక్కలేదని, పోలీసు బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయని పాల్వంచ ఏసీపీ రోహిత్ రాజు తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమ ఆత్మహత్యకు రాఘవే కారణమంటూ బాధితుడు రామకృష్ణ సెల్ఫీ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత రాఘవేంద్ర అదృశ్యమయ్యారు.

ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఆయన అరెస్ట్ అయినట్టు, ఖమ్మం తరలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని ఏసీపీ స్పష్టం చేశారు. బహుశా ఆయన తమకు చిక్కకుండా బెయిలు కోసం ప్రయత్నిస్తుండవచ్చని అన్నారు. అదే జరిగితే తాము కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.


More Telugu News