బుల్లీ భాయ్ యాప్ సృష్టికర్త ఇతడే!

  • దేశంలో సంచలనం సృష్టించిన బుల్లీభాయ్ యాప్
  • ముస్లిం మహిళల ఫొటోలతో వేలం
  • దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు
  • బుల్లీ భాయ్ యాప్ ను రూపొందించిన నీరజ్ బిష్ణోయ్
  • అసోంలో అరెస్ట్ చేసిన పోలీసులు
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న అంశం బుల్లీ భాయ్ యాప్. ముస్లిం మహిళల ఫొటోలను అప్ లోడ్ చేసి, వారిని వేలం వేస్తున్నట్టుగా సదరు యాప్ ప్రచారం చేస్తుండడం ఆగ్రహావేశాలు రగిల్చింది. ఈ వ్యవహారంలో విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు యాప్ సృష్టికర్త నీరజ్ బిష్ణోయ్ ని అరెస్ట్ చేశారు.

బిష్ణోయ్ వయసు కేవలం 21 సంవత్సరాలే. అతడో ఇంజినీరింగ్ విద్యార్థి. భోపాల్ లోని వెల్లూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) రెండో సంవత్సరం చదువుతున్నాడు. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో గిట్ హబ్ ప్లాట్ ఫాంపై బుల్లీ భాయ్ యాప్ ను రూపొందించాడు.

ఇటీవల బుల్లీ భాయ్ యాప్ లో వందల సంఖ్యలో ముస్లిం మహిళల ఫొటోలు దర్శనమిచ్చాయి. సోషల్ మీడియాలో ముస్లిం మహిళల ఖాతాల నుంచి ఆ ఫొటోలను సంగ్రహించి, యాప్ లో అప్ లోడ్ చేసినట్టు గుర్తించారు. ఆ విధంగా అప్ లోడ్ చేసిన ఫొటోల్లో వివిధ రంగాలకు చెందినవారి ఫొటోలు కూడా ఉన్నాయి  ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా బుల్లీ భాయ్ యాప్ ను రూపొందించిన నీరజ్ బిష్ణోయ్ ని అసోంలోని జోర్హాట్ జిల్లాలో అరెస్ట్ చేశారు.

బిష్ణోయ్ తండ్రి దశరథ్ ఓ దుకాణదారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో తమ ఇంటికి పోలీసులు వచ్చారని, సోదాలు చేసి తన కుమారుడ్ని తీసుకెళ్లారని వెల్లడించారు. ఓ ల్యాప్ టాప్ ను, మొబైల్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారని వివరించారు. ఆ ఫోన్ తన భార్యదని దశరథ్ తెలిపారు. తన కుమారుడు నీరజ్ బిష్ణోయ్ అమాయకుడని, ఎలాంటి తప్పిదానికి పాల్పడలేదని స్పష్టం చేశారు.

పోలీసుల విచారణలో తాను ఈ యాప్ ను గతేడాది నవంబరులో తయారుచేశానని, డిసెంబరులో అప్ డేట్ చేశానని వెల్లడించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ కేసు నేపథ్యంలో వెల్లూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అతడిని సస్పెండ్ చేసింది.


More Telugu News