యెజ్డీ బైక్... మళ్లీ వస్తోంది!

  • 60, 70వ దశకాల్లో భారత్ లో 'యెజ్డీ' హవా
  • కాలక్రమంలో కనుమరుగైన బైక్
  • 'యెజ్డీ' బైకులు తయారుచేస్తున్న క్లాసిక్ లెజెండ్స్
  • త్వరలోనే మూడు మోడళ్ల విడుదల
భారత్ లో 60వ దశకం నుంచి 80వ దశకం వరకు కుర్రకారును విశేషంగా ఆకర్షించిన రెట్రో మోటార్ సైకిళ్లలో 'యెజ్డీ' ప్రముఖమైనది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా అనేక పాత సినిమాల్లో ఈ బైకును ఉపయోగించారు. ఎంతో భారీగా, చూడ్డానికి ఠీవిగా కనిపించే 'యెజ్డీ' కొంతకాలంపాటు కనుమరుగైంది. ఇప్పుడు 'యెజ్డీ' బైకుల హక్కులను పొందిన 'క్లాసిక్ లెజెండ్స్' సంస్థ మారిన ట్రెండ్ కు అనుగుణంగా కొత్త మోడళ్లు తీసుకువస్తూ అమ్మకాలపై దృష్టి సారించింది.

తాజాగా 'యెజ్డీ' నయా మోడల్ బైకులకు సంబంధించిన టీజర్ వీడియోను విడుదల చేశారు. జనవరి 13న కొత్త మోడళ్ల రంగప్రవేశం ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. దేశీయ మార్కెట్లో పట్టు సాధించేందుకు కొత్తగా మూడు మోడళ్లు తీసుకువస్తోంది. ఇవన్నీ 334 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ సహితంగా వుంటాయని భావిస్తున్నారు. త్వరలోనే 'యెజ్డీ' కొత్త మోడల్ బైకుల పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. కాగా, మహింద్రా అండ్ మహీంద్రా అనుబంధ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ ఇప్పటికే జావా, బీఎస్ఏ బైకులను కూడా భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది.


More Telugu News