'శ్యామ్ సింగ రాయ్' దర్శకుడి టైమ్ ట్రావెల్ కథ!

  • 'టాక్సీవాలా'తో తొలి హిట్ 
  • 'శ్యామ్ సింగ రాయ్'తో మరో హిట్
  • ఖుషీ అవుతున్న రాహుల్  
  • కొత్త కథపై మొదలైన కసరత్తు
రాహుల్ సాంకృత్యన్ అనే పేరు వినగానే ఇప్పుడు అందరికీ 'శ్యామ్ సింగ రాయ్' సినిమా గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చిన వైవిధ్యభరితమైన కథా చిత్రంగా ఈ సినిమా ప్రశంసలను అందుకుంది. ఇటు నాని .. అటు సాయిపల్లవి కెరియర్లో మరో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. భారీ చిత్రాలను కూడా రాహుల్ హ్యాండిల్ చేయగలడనే విషయాన్ని నిరూపించింది.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమా నేను ఒప్పుకోవడానికి మూడు కారణాలు ఉన్నాయి. ఈ కథ 70 దశకానికి సంబంధించినది కావడం. నాకు ఎంతో ఇష్టమైన బెంగాల్ నేపథ్యంలో సాగడం. ఒక రైటర్ ను హీరోగా చూపించాలనే కోరిక నాలో బలంగా ఉండటం. అందువల్లనే ఈ సినిమాను నేను ఒక తపస్సుగా భావించి పూర్తి చేశాను .. తగిన ఫలితం లభించినందుకు ఆనందంగా ఉంది.

తరువాత నేను చేయబోయే సినిమా కూడా కొత్తగానే ఉంటుంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఒక కథను రెడీ చేశాను. కథ చాలా సంతృప్తికరంగా వచ్చింది. ప్రస్తుతం స్క్రీన్ ప్లే వర్క్ జరుగుతోంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తరువాత ఎవరితో చేస్తే బాగుంటుందా అనే విషయాన్ని గురించి ఆలోచన చేస్తాను. ఆ తరువాతనే ప్రయత్నాలు మొదలెడతాను" అని చెప్పుకొచ్చాడు.


More Telugu News