కొవిడ్ మాత్ర ‘మోల్నుపిరవిర్’తో ఎముకలు దెబ్బతినే ప్రమాదం.. హెచ్చరించిన ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ

  • ‘మోల్నుపిరవిర్’తో కండరాలు దెబ్బతినే ప్రమాదం
  • ట్యాబ్లెట్లు వేసుకునే మహిళలు మూడు నెలలపాటు గర్భం దాల్చకూడదు
  • లేదంటే పుట్టే పిల్లలకు ప్రమాదం
  • అందుకే మార్గదర్శకాల్లో చేర్చలేదు
దేశంలో అందుబాటులోకి వచ్చిన కరోనా ట్యాబ్లెట్ ‘మోల్నుపిరవిర్’తో ముప్పు పొంచి ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) చీఫ్ బలరాం భార్గవ హెచ్చరించారు. ఈ మాత్రలతో జన్యువుల్లో శాశ్వతంగా మార్పులు (మ్యూటాజెనెసిటీ) వస్తాయని పేర్కొన్నారు. అంటే ఎముకలు, కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

అందువల్లే ఈ ట్యాబ్లెట్లను కొవిడ్ జాతీయ టాస్క్‌ఫోర్స్ చికిత్సా మార్గదర్శకాల్లో చేర్చలేదన్నారు. ఈ ట్యాబ్లెట్లు వాడిన మహిళలు ఆ తర్వాత మూడు నెలలపాటు గర్భం దాల్చకుండా జాగ్రత్త పడాలని సూచించారు. లేదంటే పుట్టే పిల్లలు పలు సమస్యల బారినపడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

కాగా, ‘మోలు లైఫ్ (200 ఎంజీ)’ పేరుతో వచ్చిన ఈ ట్యాబ్లెట్లను మన దేశంలో మ్యాన్‌కైండ్ ఫార్మా సంస్థ విడుదల చేసింది. ఈ మాత్రలను ఐదు రోజుల కోర్సుగా వాడాల్సి ఉంటుంది. ధర రూ. 1,399 మాత్రమే. ఒక్కో డబ్బాలో 40 మాత్రలు ఉంటాయి. ఉదయం నాలుగు, సాయంత్రం నాలుగు చొప్పున వేసుకోవాలి. అంటే పూటకు 800 ఎంజీ డోసు అన్నమాట. అయితే, వీటిని వైద్యుల సిఫారసుతోనే వాడాల్సి ఉంటుంది.

కరోనాకు ట్యాబ్లెట్స్ అందుబాటులోకి రావడం మన దేశంలో ఇదే తొలిసారి. ఈ మాత్రలను మన దేశంలో హెటెరో, డాక్టర్ రెడ్డీస్ సహా 13 ఫార్మా సంస్థలు ఉత్పత్తి చేయనున్నాయి. ఆయా సంస్థను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో మ్యాన్‌కైండ్ మాత్రం రూ. 1,399కే అందుబాటులోకి తీసుకురాగా, సన్‌ఫార్మా రూ. 1,500, డాక్టర్ రెడ్డీస్ రూ. 1,400 ధరను నిర్ణయించినట్టు తెలుస్తోంది.


More Telugu News