ఊహించినట్టే.. 'రాధేశ్యామ్' కూడా వాయిదా.. అధికారిక ప్ర‌క‌ట‌న‌!

  • క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో వాయిదా
  • ట్విట్ట‌ర్‌లో తెలిపిన సినీ యూనిట్
  • ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ కూడా వాయిదా
  • క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టాక విడుద‌ల‌య్యే చాన్స్‌
'రాధేశ్యామ్' సినిమా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ నిన్న చేసిన‌ ట్వీట్ కు అర్థం ఏంటో తెలిసిపోయింది. కాలం చాలా క‌ఠిన‌మైందంటూ నిరాశ వ్య‌క్తం చేస్తూ ఆయ‌న నిన్న ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న ఎందుకు ఆ ట్వీట్ చేశారో ఎవ‌రికీ అర్థం కాలేదు. రాధేశ్యామ్ సినిమాను కూడా వాయిదా వేస్తున్నారా? అని నెటిజ‌న్లు సందేహాలు వ్య‌క్తం చేశారు. చివర‌కు వారి సందేహాలే నిజ‌మ‌య్యాయి.

ఆ సినిమా విడుద‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ఆ చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. క‌రోనా విజృంభ‌ణ మ‌ళ్లీ మొద‌లైన నేప‌థ్యంలో ఈ సినిమాను వాయిదా వేస్తున్న‌ట్లు ఆ సినిమా యూనిట్ తెలిపింది. ఈ నెల 7న విడుదల కావలసిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా కూడా వాయిదా పడిన విష‌యం తెలిసిందే.

ఇప్ప‌టికే ఆ సినిమా యూనిట్ కూడా అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా ప‌డిన నేప‌థ్యంలో రాధేశ్యామ్ కూడా వాయిదా ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ముందు నుంచే అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే, వాయిదా వేయ‌బోమ‌ని 'రాధేశ్యామ్' సినిమా యూనిట్ చెప్పిన‌ప్ప‌టికీ చివ‌ర‌కు దేశంలో కరోనా వ్యాప్తి మ‌రోసారి క‌ల‌క‌లం రేపుతోన్న నేప‌థ్యంలో వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకోక‌త‌ప్ప‌లేదు.

క‌రోనా విజృంభ‌ణతో ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు ఆంక్ష‌లు విధించాయి. కొన్ని రోజుల్లో మ‌రిన్ని రాష్ట్రాలు ఆంక్ష‌లు విధించే అవ‌కాశం లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో పెద్ద సినిమాలు విడుద‌ల చేస్తే న‌ష్టాలు త‌ప్ప‌వ‌ని భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాల యూనిట్లు దేశంలో క‌రోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత కొత్త విడుదల తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాలను తెలుగు, హిందీతో పాటు ప‌లు భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నారు.


            


More Telugu News