'రాధేశ్యామ్' సినిమా దర్శకుడి మాటలకు అర్థం ఏమిటో...!

  • దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
  • 'రాధేశ్యామ్' విడుదలపై తొలగని అనుమానాలు
  • విడుదల వాయిదా వేసుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రాలు
దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా నమోదవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను అమలు చేస్తున్నాయి. థియేటర్లలో కేవలం 50 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

ఏపీ విషయానికి వస్తే టికెట్ రేట్ల తగ్గింపు సినీ పరిశ్రమను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ సినిమాలు విడుదల విషయంలో పునరాలోచన చేస్తున్నాయి. 'ఆర్ఆర్ఆర్', బాలీవుడ్ చిత్రం 'జెర్సీ' విడుదలను వాయిదా వేశాయి. ప్రభాస్ తాజా చిత్రం 'రాధేశ్యామ్' విడుదల కూడా వాయిదా పడుతుందని అందరూ భావించారు. జనవరి 14న సినిమా విడుదల అవుతుందని ఇటీవలే చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా ప్రకటించినప్పటికీ అందరిలో అనుమానాలు అలాగే ఉండిపోయాయి.

తాజాగా 'రాధేశ్యామ్' సినిమా దర్శకుడు రాధాకృష్ణకుమార్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సమయాలు చాలా కఠినమైనవని... హృదయాలు బలహీనంగా, మనసులు అల్లకల్లోలంగా ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు. జీవితం మనపైకి ఏది విసిరినా ఆశలు మాత్రం ఉన్నతంగా ఉంటాయని చెప్పారు. దీంతో 'రాధేశ్యామ్' విడుదల వాయిదా గురించే ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారని నెటిజెన్లు స్పందిస్తునన్నారు.


More Telugu News