తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్లీ పెరిగిన చ‌లి తీవ్ర‌త‌

  • విశాఖ ఏజెన్సీలో చ‌లిపులి పంజా
  • ఉష్ణోగ్ర‌తలు భారీగా ప‌డిపోయిన వైనం
  • మినుములూరులో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
  • ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారిలో 10.9 డిగ్రీల కనిష్ఠ‌ ఉష్ణోగ్రత
విశాఖ ఏజెన్సీలో చ‌లిపులి పంజా విసురుతోంది. క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌తలు భారీగా ప‌డిపోయాయి. మినుములూరు, పాడేరులో క‌నిష్ఠ‌ ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణం కంటే త‌క్కువ‌గా న‌మోదు కావ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు.

పొగమంచు, ఎముకలు కొరికే చలితో గజగజా వణికిపోతున్నారు. కొన్ని రోజుల నుంచి చలి గాలుల తీవ్ర‌త కూడా ఎక్కువైపోవ‌డంతో ఏజెన్సీ ప్రజలు బయటకు రావాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతమంతా పొగ మంచుతో నిండిపోయి, ఏమీ కనిపించట్లేదని అక్క‌డి ప్ర‌జ‌లు వాపోతున్నారు. వాహ‌నాల‌నూ న‌డ‌ప‌లేక‌పోతున్నామ‌ని చెబుతున్నారు. ఈ క్రమంలో మినుములూరులో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు చెప్పారు.

మ‌రోవైపు, తెలంగాణలోనూ కొన్ని రోజుల పాటు త‌గ్గిన‌ చలి తీవ్ర‌త‌ మళ్లీ పెరిగింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారిలో 10.9 డిగ్రీల కనిష్ఠ‌ ఉష్ణోగ్రత నమోదైంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు చలి అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


More Telugu News