కారు ప్రయాణం మరింత సురక్షితం!.. త్వరలోనే ప్రతి కారులో ఆరు ఎయిర్ బ్యాగులు!

  • అమలు దిశగా కేంద్ర రవాణా శాఖ చర్యలు
  • ముందు, వెనుక భాగంలోని వారికి రక్షణ
  • ఒక్కో ఎయిర్ బ్యాగు కోసం రూ.2,200 వ్యయం
  • అమలు చేస్తే కారు ధర రూ.9,000 పెరిగే అవకాశం
త్వరలో కారులో కూర్చుని ప్రయాణించే ప్రతి వ్యక్తికి రక్షణగా ఒక ఎయిర్ బ్యాగ్ ఏర్పాటు కాబోతోంది. ఈ దిశగా కేంద్ర రవాణా శాఖ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

గతంలో ఖరీదైన కార్లలోనే ఎయిర్ బ్యాగులు ఉండేవి. కానీ, ప్రమాదాల సమయంలో ప్రాణాలు రక్షిస్తాయని బావిస్తున్న ఎయిర్ బ్యాగులను ధరతో సంబంధం లేకుండా అన్ని రకాల కార్లలో ముందుభాగంలో ఏర్పాటు చేయాలంటూ కేంద్ర రవాణ శాఖ ఆదేశాలు తీసుకొచ్చింది. కారు నడిపే వ్యక్తితోపాటు ముందు భాగంలో కూర్చునే మరో వ్యక్తికి రక్షణగా వీటి ఏర్పాటును ప్రతిపాదించింది. ఆ తర్వాత, వెనుక సీట్లో కూర్చున్న వారి రక్షణ దృష్ట్యా ఎయిర్ బ్యాగులు ఏర్పాటు చేయించాలనే యోచనతో కేంద్ర రవాణా శాఖ ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

మరో నాలుగు ఎయిర్ బ్యాగుల ఏర్పాటుకు, వీటికి సంబంధించి చేయాల్సిన మార్పుల కోసం ఒక్కో కారుపై అదనంగా రూ.8,000-9,000 వరకు వ్యయం అవుతుందని ఆటోమొబైల్ కంపెనీలు తెలిపాయి. కొంచెం అదనంగా వెచ్చించడం వల్ల ప్రయాణికులకు రక్షణ ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

అన్ని కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులు ఏర్పాటు చేయాలని, ఇందుకు ఎంత వ్యయం అవుతుందో అంచనాలతో రావాలంటూ కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గతేడాది కార్ల కంపెనీలకు పిలుపునివ్వడం గమనార్హం. ఒక్కో ఎయిర్ బ్యాగు ధర రూ.1,800 కాగా, ఇందుకోసం చేయాల్సిన మార్పులకు రూ.400 వరకు ఖర్చవుతుందని కంపెనీలు ప్రభుత్వానికి తెలియజేశాయి. అంటే ఒక్కో కారుపై ఎంతలేదన్నా రూ.9,000 వరకు ధర పెరుగుతుంది.


More Telugu News