విభేదాలు సృష్టించాల‌ని ప్ర‌య‌త్నిస్తే ఊరుకునేది లేదు: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి వార్నింగ్‌

  • కృష్ణా జిల్లా, మైలవరంలో వైసీపీ నేత‌ల్లో విభేదాలు
  • అసెంబ్లీ సీటు కోసం వర్గపోరు
  • అభ్య‌ర్థిగా వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ కొన‌సాగుతార‌ని పెద్దిరెడ్డి స్ప‌ష్టం
ఏపీలోని కృష్ణా జిల్లా, మైలవరంలో వైసీపీ నేత‌ల్లో విభేదాలు త‌లెత్తుతుండ‌డంతో మంత్రి పెద్దిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీ సీటు కోసం వర్గపోరు సాగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న ఈ విష‌యంపై స్పందిస్తూ.. భ‌విష్య‌త్తులోనూ మైల‌వ‌రం నియోజ‌క వ‌ర్గం నుంచి పార్టీ అభ్య‌ర్థిగా వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ కొన‌సాగుతార‌ని చెప్పారు. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఎవ‌రైనా ప‌నిచేస్తే పార్టీకి వ్య‌తిరేకంగా ప‌నిచేసిన‌ట్లేన‌ని స్ప‌ష్టం చేశారు.

అటువంటి వారిపై పార్టీలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పెద్దిరెడ్డి హెచ్చ‌రించారు. జోగి ర‌మేశ్ పెడ‌న ఎమ్మెల్యేగా ఉన్నార‌ని, భ‌విష్య‌త్తులోనూ ఆయ‌న అక్క‌డి నుంచే పోటీ చేస్తార‌ని పెద్దిరెడ్డి స్ప‌ష్టం చేశారు. వారిద్ద‌రి మ‌ధ్య అన‌వ‌స‌ర విభేదాలు సృష్టించాల‌ని ప్ర‌య‌త్నిస్తే ఊరుకునేది లేదని త‌మ పార్టీ శ్రేణుల‌కు వార్నింగ్ ఇచ్చారు.

పార్టీ ఆదేశాల‌ను ప‌ట్టించుకోకుండా విభేదాలు సృష్టించే ప్ర‌య‌త్నాలు చేసేవారిని పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపుతామ‌ని ఆయ‌న చెప్పారు. అంద‌రూ క‌లిసి ప‌ని చేస్తేనే పార్టీ మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని పెద్దిరెడ్డి తెలిపారు.


More Telugu News