కరోనా థర్డ్ వేవ్ వచ్చేసింది.. ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉంది: దేశ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ అరోరా

  • డిసెంబర్ తొలి వారంలో తొలి ఒమిక్రాన్ కేసు నిర్ధారణ అయింది
  • గత వారం చివరినాటికి ఒమిక్రాన్ కేసులు 28 శాతానికి పెరిగాయి
  • ఒమిక్రాన్ రూపంలో మనకు థర్డ్ వేవ్ వచ్చింది
మన దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందనే భయాలు నిజమయ్యాయి. ప్రస్తుతం ఇండియా థర్డ్ వేవ్ లో ఉందని దేశ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ ఎన్.కే.అరోరా ప్రకటించారు. ఒమిక్రాన్ కేసులతో దేశం థర్డ్ వేవ్ ను ఎదుర్కొంటోందని చెప్పారు. ఒమిక్రాన్ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉందని... మొత్తం కేసుల్లో 75 శాతం కేసులు ఢిల్లీ, ముంబై, కోల్ కతాలో నమోదవుతున్నాయని తెలిపారు.  

డిసెంబర్ తొలి వారంలో జీనోమ్ సీక్వెన్స్ లో తొలి ఒమిక్రాన్ కేసు నిర్ధారణ అయిందని అరోరా చెప్పారు. గత వారంలో దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 12 శాతం పెరిగాయని, వారం పూర్తయ్యేటప్పటికి కేసుల సంఖ్య 28 శాతానికి పెరిగిందని తెలిపారు. ఈ వేరియంట్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతోందో ఈ గణాంకాలు చెపుతున్నాయని అన్నారు.

మనం కచ్చితంగా ఇప్పుడు థర్డ్ వేవ్ లో ఉన్నామని ఆయన చెప్పారు. ఒమిక్రాన్ రూపంలో మనం థర్డ్ వేవ్ లోకి ప్రవేశించామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ వల్ల 15 నుంచి 18 మధ్య వయసు పిల్లలకు ఎలాంటి ప్రమాదం ఉండదని డాక్టర్ అరోరా తెలిపారు. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనదని స్పష్టం చేశారు.


More Telugu News