డిజిటల్ చెల్లింపులకు ఇక నెట్‌తో పనిలేదు.. విధివిధానాలు ప్రకటించిన రిజర్వు బ్యాంకు

  • ఈ విధానం తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటన
  • ఒక్కో లావాదేవీ గరిష్ఠంగా రూ. 200 చేసుకోవచ్చు 
  • లావాదేవీల మొత్తం రూ. 2 వేలకు మించకూడదు 
  • గ్రామీణ, చిన్న పట్టణాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకే
డిజిటల్ చెల్లింపులకు తప్పనిసరిగా నెట్ ఉండాల్సిందే. ఫోన్‌లో డేటా కోటా అయిపోయినా, సిగ్నల్స్ అందకున్నా నానా పాట్లు పడాల్సి వస్తుంది. ఒకవేళ చచ్చీచెడి డిజిటల్‌లో పే చేసినా ఒక్కోసారి అవి వ్యాపారి ఖాతాలో జమ కావడం లేదు. అయితే, ఇకపై ఈ బాధలు తప్పినట్టే.

ఎందుకంటే, ఆఫ్‌లైన్‌లోనూ డిజిటల్ పేమెంట్లకు అనుమతినిస్తూ భారతీయ రిజర్వు బ్యాంకు విధివిధానాలు రూపొందించింది. సోమవారం వీటిని విడుదల చేయగా, తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే, ఆఫ్‌లైన్ చెల్లింపుల్లో ఒక్కో లావాదేవీ గరిష్ఠంగా రూ. 200, లావాదేవీల మొత్తం రూ. 2 వేలకు మించకుండా మాత్రమే ఈ వెసులుబాటును కల్పించింది.

గ్రామీణ ప్రాంతాలతోపాటు చిన్న పట్టణాల్లో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 2020 నుంచి గతేడాది జూన్ వరకు కొన్ని ప్రాంతాల్లో వివిధ దశల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టింది. సత్ఫలితాలు రావడంతో దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ చెల్లింపులు ముఖాముఖి (ఫేస్ టు ఫేస్) మాత్రమే చేయాల్సి ఉంటుంది. పాయింట్ ఆఫ్ సేల్ (పీఎస్ఓ) లాంటి యంత్రాల ద్వారానూ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు దీనికి నెట్‌తో పని ఉండదు.

రోజువారీ లావాదేవీలు పూర్తయ్యాక వ్యాపారి తన పీఎస్ఓను నెట్‌కు అనుసంధానిస్తే ఆ రోజు జరిగిన లావాదేవీలన్నీ ప్రాసెస్ అవుతాయి. ఈ మేరకు పేమెంట్ సిస్టం ఆపరేటర్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వంటి పేమెంట్ సిస్టం పార్టిసిపెంట్లు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రిజర్వు బ్యాంకు సూచించింది.


More Telugu News