ఆన్‌లైన్ గేమ్స్‌‌కు బానిసగా మారి అప్పులు.. భార్య, ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య

  • చెన్నైలో ఈ నెల 31న ఘటన
  • రెండు నెలలుగా ఉద్యోగానికి సెలవు పెట్టి ఆన్‌లైన్ గేమ్స్‌‌
  • భార్య మందలించడంతో ఘర్షణ
ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారిన ఓ భర్త పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. వాటి నుంచి బయటపడే మార్గం కానరాక భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నైలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

 పోలీసుల కథనం ప్రకారం.. కోయంబత్తూరుకు చెందిన మణికంఠన్ (36) చెన్నైలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ భార్య తార (35), ఇద్దరు పిల్లలు ధరణ్ (10), దహాన్ (1)తో కలిసి పెరియార్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు.

రెండు నెలలుగా ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండి ఆన్‌లైన్‌లో గేమ్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలో అప్పులపాలయ్యాడు. ఉద్యోగానికి వెళ్లకుండా ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతూ కూర్చుంటున్న భర్తను తార పలుమార్లు మందలించింది. అయినా చలనం లేకపోవడంతో పలుమార్లు ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.

డిసెంబరు 31న మరోమారు దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో భార్య, ఇద్దరు పిల్లలను చంపేసిన మణికంఠన్ తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజులుగా ఇంటి తలుపులు మూసే ఉండడంతో అనుమానించిన స్థానికులు నిన్న పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లోపల నలుగురు నిర్జీవంగా పడి ఉండడాన్ని చూసి విస్తుపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News