సినీ కార్మికులకు లైఫ్ టైమ్ హెల్త్ కార్డులను పంపిణీ చేసిన చిరంజీవి

  • చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, యోద డయాగ్నస్టిక్స్ ఆధ్వర్యంలో కార్డులు
  • సగం ధరలకే టెస్టులు చేయించుకునే వెసులుబాటు
  • క్యూఆర్ తో కూడిన కార్డుల జారీ
  • కార్మికుడితో పాటు కుటుంబం మొత్తానికి కార్డులు
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, యోద డయాగ్నస్టిక్స్ ఆధ్వర్యంలో సినీ పరిశ్రమలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు లైఫ్ టైమ్ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. సాంకేతికత ఆధారంగా హెల్త్ కార్డులను తయారు చేశామని, వాటిని కార్మికులకు అందజేస్తామని చెప్పారు. కార్డుపై క్యూఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే కార్డుదారుల వివరాలు, వారు తీసుకున్న ట్రీట్ మెంట్ వివరాలన్నీ తెలుస్తాయని చిరంజీవి చెప్పారు.

ఎవరు.. ఏ తేదీన.. ఏ టెస్టు చేయించుకున్నారు? ఆ టెస్ట్ రిజల్ట్ ఏంటి? వంటి వివరాలు కూడా తెలుస్తాయన్నారు. ఈ కార్డుతో కార్డుదారు ఫ్యామిలీ మొత్తం టెస్టులు చేయించుకునే వీలుంటుందని పేర్కొన్నారు.


సినీ పరిశ్రమలోని 18 యూనియన్లకు చెందిన కార్మికులు వంద శాతం ఈ డయాగ్నస్టిక్ హెల్త్ కార్డుల కోసం రిజిస్టర్ చేసుకున్నారని, మరో ఆరు యూనియన్లకు చెందిన కార్మికుల వివరాలను నమోదు చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. కార్మికులు తమకు సంబంధించిన యూనియన్లలో వివరాలను అందజేస్తే వీలైనంత త్వరగా ఈ హెల్త్ కార్డులను అందించేందుకు వీలవుతుందన్నారు. ఇంటికి వచ్చి ఈ కార్డులను ఇవ్వరని, దయచేసి యూనియన్ లో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు.

ఇప్పటిదాకా ఆరేడు వేల మందికి కార్డులను అందజేశామని, మిగతా వారికి దశలవారీగా అందజేస్తామని చెప్పారు. సంక్రాంతి నాటికి అందరికీ హెల్త్ కార్డులివ్వాలని టార్గెట్ పెట్టారని, టార్గెట్ టైంకు అది పూర్తికాకపోయినా ఈ నెలాఖరునాటికి కార్మికులకు డయాగ్నస్టిక్స్ హెల్త్ కార్డులను జారీ చేస్తామని పేర్కొన్నారు.

ఈ హెల్త్ కార్డుల ద్వారా సగం ధరకే టెస్టులు చేయించుకోవచ్చని చిరంజీవి చెప్పారు. జబ్బులను ముందే గుర్తించగలిగితే వాటిని నయం చేయడం సులభమవుతుందని, అందుకే ఈ డయాగ్నస్టిక్స్ కార్డులను ఇస్తున్నామని పేర్కొన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబానికి ధైర్యమన్నారు. కుటుంబానికి భరోసాగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. సినీ కార్మికులకు అండగా ఉండాలన్న లక్ష్యంతో హెల్త్ కార్డులిస్తున్నామన్నారు.


More Telugu News