న్యూఇయర్ సందర్భంగా స్విగ్గీ, జొమాటోకు ఆర్డర్ల వరద

  • స్విగ్గీకి నిమిషానికి 9,500 ఆర్డర్లు
  • జొమాటోకు 8,000 ఆర్డర్లు
  • ఒక్కో సంస్థకు 20లక్షలకు పైనే రాక
  • బిర్యానీ, బటర్ నాన్, చికెన్ ఫ్రైడ్ రైస్ కు మొగ్గు
నూతన సంవత్సర (2022) వేడుకల సందర్భంగా ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ లు స్విగ్గీ, జొమాటో భారీ సంఖ్యలో ఆర్డర్లు అందుకున్నాయి. ఒమిక్రాన్ రకం కరోనా ఎంతో వేగంగా వ్యాపిస్తుండడంతో తాము ఉన్న చోటుకి ఆహారాన్ని తెప్పించుకునేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపించారు. దీంతో అంచనాలకు మించి ఆర్డర్లు ఈ సంస్థలకు వచ్చాయి.

డిసెంబర్ 31న స్విగ్గీ నిమిషానికి 9,500 ఆర్డర్లను అందుకుంటే, జొమాటోకు నిమిషానికి 8,000కు పైనే ఆర్డర్లు (దేశవ్యాప్తంగా) వచ్చాయి. నూతన సంవత్సరం సంబరాల సందర్భంగా 20 లక్షల ఆర్డర్లను అధిగమించినట్టు స్విగ్గీ సీఈవో శ్రీహర్ష మాజేటి ట్విట్టర్ లో ప్రకటించారు. అత్యధికంగా బిర్యానీ ఆర్డర్లే వచ్చినట్టు చెప్పారు. జొమాటో కూడా నూతన సంవత్సరాది సందర్భంగా 20 లక్షల ఆర్డర్ల మైలురాయి దాటిపోయినట్టు తెలిపింది.

‘‘ఓ మై గాడ్ 2 మిలియన్ల ఆర్డర్లు! ఒకే రోజులో ఇన్ని రావడం మొదటిసారి. మరో మూడు గంటలు మిగిలి ఉంది’’ అంటూ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ అన్నారు. చికెన్ బిర్యానీ, బటర్ నాన్, మసాలా దోశ, పనీర్ బటర్ మసాలా, చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్లు ఎక్కువగా వచ్చినట్టు స్విగ్గీ ప్రకటించింది. నిమిషానికి 1,229 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్టు తెలిపింది.


More Telugu News