క్రికెట్ లో అతడు అద్భుతాలు చేస్తాడు.. అందుకే వన్డేలకు ఎంపిక చేశామన్న చీఫ్ సెలెక్టర్

  • రుతురాజ్ గైక్వాడ్ పై చేతన్ శర్మ ప్రశంసల వర్షం
  • సరైన సమయంలో అవకాశమిచ్చామని వెల్లడి
  • తుది జట్టులోకి ఎప్పుడు తీసుకోవాలన్నది మేనేజ్ మెంట్ ఇష్టం
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న రుతురాజ్ గైక్వాడ్ పై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ప్రశంసల జల్లు కురిపించారు. సౌతాఫ్రికాతో ఈ నెల 19 నుంచి జరగబోయే వన్డేలకు అతడిని జట్టులోకి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చేతన్ శర్మ స్పందించారు. ఈ మహారాష్ట్ర బ్యాటర్.. క్రికెట్ లో దేశం తరఫున అద్భుతాలు సృష్టిస్తాడని చెప్పుకొచ్చారు.

‘‘అతడికి సరైన సమయంలో సరైన అవకాశం ఇచ్చాం. టీ20 జట్టుకి అతడిని ఇప్పటికే ఎంపిక చేశాం. ఇప్పుడు వన్డే జట్టులోనూ అవకాశం ఇస్తున్నాం. అతడు అద్భుతాలు చేస్తాడని సెలెక్టర్లంతా నమ్ముతున్నారు. అవసరమైన స్థానంలో అతడిని బ్యాటింగ్ కు దింపుతారు’’ అని పేర్కొన్నారు. రుతురాజ్ ను జట్టుకైతే తాము ఎంపిక చేశామని, ఫైనల్ ఎలెవెన్ (తుది జట్టు)లో ఎప్పుడు తీసుకుంటారనేది మేనేజ్ మెంట్ ఇష్టమని చెప్పారు. అతడి అవసరం ఎప్పుడుంటుంది? కాంబినేషన్ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

 కాగా, గత ఏడాది ఐపీఎల్ లో 635 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ను రుతురాజ్ సొంతం చేసుకున్నాడు. విజయ్ హాజరే ట్రోఫీలోనూ సత్తా చాటాడు. ఐదు మ్యాచ్ లలో 603 పరుగులు చేశాడు. గాయం కారణంగా రోహిత్ శర్మ వన్డేలకూ దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో రాహుల్ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు.


More Telugu News