చేసే పని ప్రపంచానికి ఉపయోగపడాలి..: యూత్ కి ఎలాన్ మస్క్ సూచనలు

  • ఉపయోగకరంగా ఉండడం కష్టమేనని తెలుసుకోవాలి
  • ఎంత మందితో మాట్లాడితే అంత వికాసం
  • పుస్తక పఠనం ద్వారా జ్ఞానం పెంచుకోవాలి
ఎలక్ట్రిక్ వాహన తయారీ, శాటిటైల్ వెబ్ సేవలు, ఇలా ఎన్నో విభాగాల్లో విజయవంతమైన పారిశ్రామికవేత్తగా దూసుకుపోతున్న అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్ విద్యార్థులకు విలువైన సూచనలు ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు లెక్స్ ఫ్రైడ్ మ్యాన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇందుకు వేదికగా నిలిచింది. ఏదైనా పెద్దగా చేయాలనుకునే యువతకు మీరిచ్చే సలహా ఏంటి? అన్న ప్రశ్న మస్క్ కు ఎదురైంది.

దీనికి మస్క్ స్పందిస్తూ.. నలుగురికీ ఉపయోగపడేది చేయాలంటూ సలహ ఇచ్చారు. ‘‘తోటి మానవులు, ప్రపంచానికి ఉపయోగపడే పనులు చేయాలి. ఉపయోగకరంగా ఉండడం చాలా కష్టం. యుక్త వయసులో ఉన్న మీరు వినియోగించుకునే దానికంటే ఇచ్చేదే ఎక్కువగా ఉండాలి’’ అని మస్క్ సూచించారు.

పుస్తక పఠనం చేయాలంటూ విద్యార్థులకు ఆయన హితవు పలికారు. తద్వారా జ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. అప్పుడే చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతుందన్నది తెలుస్తుందన్నారు. ‘‘ఎంత మంది భిన్నమైన వ్యక్తులతో మీరు మాట్లాడితే మీ మనసు అంతగా వికసిస్తుంది. భిన్నమైన రంగాలు, వృత్తులు, నైపుణ్యాలున్న వారితో మాట్లాడాలి’’ అని పేర్కొన్నారు.

కావాల్సింది ప్రతిభే కానీ, పట్టాలు కావంటూ ఎలాన్ మస్క్ లోగడ కూడా చెప్పడం గమనార్హం. కాలేజీ డిగ్రీ, స్కూలు విద్యార్హత కూడా అవసరం లేదన్నారు. ‘‘ఎవరైనా గొప్ప విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటే వారు సమర్థులు, గొప్పవారనుకుంటారు. అలా భావించొద్దు. బిల్ గేట్స్ లేదా లారీ ఎల్లిసన్, స్టీవ్ జాబ్స్ కు కాలేజీ డిగ్రీ కూడా లేదు. అటువంటి వారిని నియమించుకునే అవకాశం లభిస్తే అది మంచి ఆలోచన అవుతుంది’’అని మస్క్ గతంలో చెప్పారు.


More Telugu News