క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.102 తగ్గింపు

  • న్యూ ఇయ‌ర్, సంక్రాంతి వేళ గుడ్‌న్యూస్‌
  • నేటి నుంచే త‌గ్గించిన‌ ధ‌ర‌ల అమ‌లు
  • 19 కేజీల కమర్షియల్‌ సిలిండర్ ధ‌ర రూ.1998.50
న్యూ ఇయ‌ర్, సంక్రాంతి వేళ వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ ధరల‌ను త‌గ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. 19 కేజీల కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.102.50 తగ్గిస్తున్నట్లు, నేటి నుంచే ఈ నిర్ణ‌యం అమల్లోకి వస్తున్నట్లు ప్ర‌క‌టించింది. గ‌త నెల‌ 1న వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.100కు పైగా పెంచిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు దాదాపు అంతే రేటును త‌గ్గించ‌డం గ‌మ‌నార్హం.

గ‌త నెల ఢిల్లీలో వాణిజ్య‌ సిలిండర్ ధర ఏకంగా రూ.2,101కు పెరిగింది. వాణిజ్య సిలిండ‌ర్లు హోటళ్లు, టీ స్టాల్‌ వ్యాపారుల వంటి వారు వాడ‌తారు. ఆ సిలిండర్ల ధరను తగ్గించడంతో వారికి ఊరట ల‌భించింది. తాజాగా త‌గ్గించిన ధ‌ర‌ల‌తో ఇప్పుడు ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.1998.50గా ఉండ‌నుంది.

అయితే, గృహ అవసరాలను వినియోగించే వంటి గ్యాస్ ధ‌ర‌ల్లో ఎలాటి మార్పులూ లేవు. 14.2, 5, 10 కిలోల‌ కాంపోజిట్‌, 5 కేజీల కాంపోజిట్‌ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు చేయట్లేద‌ని చ‌మురు సంస్థ‌లు తెలిపాయి. ఇటీవల సబ్సిడీ వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను చ‌మురు సంస్థ‌లు భారీగా పెంచిన విషయం విదిత‌మే.

ప్ర‌స్తుతం 14.2 కేజీల సిలిండర్‌ ధర ఢిల్లీ, ముంబైలో రూ.899.50గా ఉండగా, కోల్‌కతాలో రూ.926గా ఉంది. ఇక‌ హైదరాబాద్‌లో ఆ సిలిండ‌ర్ ధ‌ర‌ రూ.950కు పైనే ఉంది. సంక్రాంతి పండుగ ముందైనా వంట గ్యాస్ ధ‌ర‌లు త‌గ్గుతాయ‌ని భావించిన వినియోగ‌దారుల‌కు నిరాశే మిగిలింది.


More Telugu News