సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల వర్గీకరణపై వచ్చే నెలలో మరోసారి సమావేశం కానున్న ప్రభుత్వ కమిటీ

  • సినీ రంగ సమస్యలపై ప్రభుత్వ కమిటీ ఏర్పాటు
  • రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి చైర్మన్ గా కమిటీ
  • నేడు సమావేశమైన కమిటీ సభ్యులు
  • పలు అంశాలపై చర్చ
  • మరింత అధ్యయనం అవసరమన్న కమిటీ చైర్మన్
ఏపీలో సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్ నేతృత్వంలో ఇవాళ కమిటీ సమావేశమైంది. నిర్మాతలు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను, విజ్ఞప్తులను నేటి సమావేశంలో చర్చించారు.

ప్రధానంగా సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల వర్గీకరణ అజెండాగా ఈ సమావేశం జరిగింది. ఇప్పటివరకు ప్రభుత్వానికి అందిన పలు అభ్యర్థనలను కూడా ఈ భేటీలో పరిశీలించారు. తాజా సమావేశంలో ఫిలించాంబర్ ప్రతినిధుల నుంచి కూడా అభిప్రాయాలను తీసుకున్నారు. అయితే, ప్రభుత్వానికి లిఖితపూర్వక ప్రతిపాదనలు చేయాలంటూ కమిటీ చైర్మన్ విశ్వజిత్ ఫిలించాంబర్ సభ్యులకు సూచించారు.

ఇక, టికెట్ల ధరలు, థియేటర్ల వర్గీకరణపై మరింత లోతుగా చర్చించాలని, అందుకోసం మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. వచ్చే నెల 11న సమావేశం అవుతామని ప్రభుత్వ కమిటీ చైర్మన్ తెలిపారు. దీనిపై మరింత అధ్యయనం అవసరమని భావిస్తున్నామని పేర్కొన్నారు.


More Telugu News