అంబేద్కర్ ను నేను దూషించాననడం అవాస్తవం: వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి

  • అంబేద్కర్ పై శ్రీదేవి వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం
  • ఖండించిన శ్రీదేవి
  • మార్ఫింగ్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
  • పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడి
మాదిగలకు హక్కులు అంబేద్కర్ వల్ల రాలేదని, బాబూ జగజ్జీవన్ రామ్ వల్ల వచ్చాయని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారంటూ విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉండవల్లి శ్రీదేవిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను బర్తరఫ్ చేయాలంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. శ్రీదేవి వ్యాఖ్యలను నిరసిస్తూ పలుచోట్ల అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకాలు చేశారు.

దీనిపై ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. అంబేద్కర్ పై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, రాజ్యాంగ నిర్మాతను తాను దూషించాననడం అవాస్తవమని అన్నారు. తాను చిన్ననాటి నుంచి అంబేద్కర్ వాదినే అని స్పష్టం చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

మార్ఫింగ్, ఎడిటింగ్ చేసిన వీడియోలను వైరల్ చేస్తున్నారని, అందువల్ల అంబేద్కర్ వాదుల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ దళితులకు రెండు కళ్ల లాంటివారని ఉండవల్లి శ్రీదేవి అభివర్ణించారు. మార్ఫింగ్ వీడియోతో దుష్ప్రచారం చేస్తున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.


More Telugu News