కేసీఆర్‌కు వీరి స‌మ‌స్య‌లు ప‌ట్టవా?: బండి సంజ‌య్ ఫైర్

  • 317 జీవోను స‌మీక్షించాలి
  • మరోసారి సకల జనుల సమ్మె జరగాల్సిందే
  • ఉద్యోగులు, ఉపాధ్యాయుల బ‌దిలీల్లో అవ‌క‌త‌వ‌క‌లు
  • మేము ఉద్యోగ సంఘాల నాయకులకు వ్యతిరేకం కాదు
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై తెలంగాణ‌ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన 317 జీవోను స‌మీక్షించాల‌ని, దాన్ని స‌వ‌రించాల‌ని స‌ర్కారుకి సూచించాల‌ని కోర‌డానికి ఈ రోజు గవర్నర్ తమిళిసైతో బీజేపీ బృందం సమావేశం అయింది. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ... ఉపాధ్యాయ, ఉద్యోగుల ఇబ్బందులను త‌మిళిసైకు తాము వివరించామని చెప్పారు.

రాష్ట్రంలో మరోసారి సకల జనుల సమ్మె జరగాల్సిందేనని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల బ‌దిలీల్లో అవ‌క‌త‌వ‌క‌లు చోటు చేసుకుంటున్నాయ‌ని ఆరోపించారు. తాము ఉద్యోగ సంఘాల నాయకులకు వ్యతిరేకం కాదని చెప్పారు. ఉద్యోగులను ఇబ్బందుల‌కు గురిచేస్తోన్న పాపం కేసీఆర్‌కు తగులుతుంద‌ని ఆయ‌న అన్నారు.

వెంట‌నే ఉద్యోగులను పిలిచి చర్చించాల‌ని, అంత‌వ‌ర‌కు రాష్ట్రంలో ఉద్యోగుల‌ బదిలీల ప్రక్రియను నిలిపివేయాలని ఆయ‌న అన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చి 40 నెలలు అవుతున్న‌ప్ప‌టి‌కీ వాటిని రాష్ట్ర స‌ర్కారు ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని బండి సంజయ్ ఆరోపించారు. ఉద్యోగులతో చ‌ర్చించ‌కుండానే 317 జీవోను తీసుకొచ్చారని ఆయ‌న విమ‌ర్శించారు. ఉద్యోగుల‌ సీనియారిటీ జాబితా తప్పుల తడకగా ఉంద‌ని చెప్పారు. కేసీఆర్‌కు వీరి స‌మ‌స్య‌లు ప‌ట్టవా? అని ఆయన ప్ర‌శ్నించారు.

ఉద్యోగులకు త‌మ పార్టీ అండగా ఉంటుందన్నారు. తాము జీవో 317ను వ్య‌తిరేకించ‌డం లేద‌ని, దాన్ని స‌వ‌రించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్నామ‌ని చెప్పారు. ఏక‌పక్షంగా ప్ర‌భుత్వం నిర్ణ‌యాలు తీసుకుంటుండ‌డం స‌రికాద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను ఇలా ఇబ్బందుల‌కు గురి చేయ‌డం ముఖ్య‌మంత్రికి స‌రికాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు త‌లుచుకుంటే త‌మ‌కు ఇష్ట‌మైన వారిని ఎక్కడినుంచి ఎక్క‌డికైనా బ‌దిలీ చేసుకోవ‌చ్చ‌న్నట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.


More Telugu News