దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ సంచలన నిర్ణయం.. టెస్టుల నుంచి తక్షణం తప్పుకుంటున్నట్టు ప్రకటన

  • సెంచూరియన్ టెస్టు తర్వాత అనూహ్య ప్రకటన
  • ఇకపై తన పూర్తి సమయం కుటుంబానికేనని స్పష్టీకరణ
  • పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగుతాడన్న సీఎస్ఏ 
భారత్‌తో సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టు ముగిసిన తర్వాత సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ సంచలన ప్రకటన చేశాడు. టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు, ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొన్నాడు. క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) విడుదల చేసిన ఈ ప్రకటన విని అభిమానులు షాకయ్యారు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం అతడు కొనసాగుతాడని సీఎస్ఏ పేర్కొంది.

ఈ నిర్ణయాన్ని తాను అంత ఆషామాషీగా తీసుకోలేదని, ఎన్నో రోజులు ఆలోచించిన తర్వాతే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. కుటుంబమే తనకు అన్నీ అని, తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో భవిష్యత్ గురించి ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెప్పాడు. ఇకపై ఎక్కువ సమయం కుటుంబానికే కేటాయించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు.

టెస్టు క్రికెట్ అంటే తనకు ఎంతో ఇష్టమన్న డికాక్.. తన క్రికెట్ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నట్టు చెప్పాడు. ఇప్పుడు మరో జీవితాన్ని చూడబోతున్నానని పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు తనతో కలిసి ప్రయాణించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నాడు. కాగా, డికాక్ ఇప్పటి వరకు 54 టెస్టుల్లో సౌతాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. 3300 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలు ఉన్నాయి.


More Telugu News