సోము వీర్రాజు తాగుబోతులకు అధ్యక్షుడా ఏంటీ?: ఏపీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి

  • ఏపీ ప్ర‌జ‌ల‌కు చీప్ లిక్కర్ ఇచ్చి వారిని సంతోషపెడతారా?
  • సోము వీర్రాజు వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిసిపోతోంది
  • అలాంటి వ్యక్తులు బీజేపీలో ఉంటే పార్టీకి ఎన్నిక‌ల్లో డిపాజిట్లు కూడా రావు
  • సోము వీర్రాజులాంటి వాళ్లు రాజకీయాల్లోకి ఎందుకొచ్చారో?
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే రూ.50లకే క్వార్టర్ నాణ్యమైన మద్యాన్ని ఇస్తామంటూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లపై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురుస్తూనే ఉంది. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా స్పందించారు. ఈ రోజు ఉద‌యం తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్న ఆయ‌న అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ... సోము వీర్రాజు బీజేపీ ఏపీకి అధ్యక్షుడా? లేదంటే తాగుబోతులకు అధ్యక్షుడా? అన్నది అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.

ఏపీ ప్ర‌జ‌ల‌కు చీప్ లిక్కర్ ఇచ్చి వారిని సంతోషపెడతానని చెప్పడంతో సోము వీర్రాజు వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిసిపోతోంద‌ని ఆయ‌న అన్నారు. సోము వీర్రాజు లాంటి వ్యక్తులు బీజేపీలో ఉంటే పార్టీకి ఎన్నిక‌ల్లో డిపాజిట్లు కూడా రావని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌ మోదీ గుర్తించాలని ఆయ‌న సూచించారు.

సోము వీర్రాజులాంటి వాళ్లు రాజకీయాల్లోకి ఎందుకొచ్చారో అర్థం కావడం లేదని ఆయ‌న చుర‌క‌లంటించారు. ఎవరెన్ని కుట్రలు చేసినప్ప‌టికీ సీఎం జగన్‌కు భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయని  ఆయ‌న అన్నారు.

కాగా, ఏపీ సీఎం జగన్ ఓ సింహంలాంటి వార‌ని ఆయ‌న కొనియాడారు. ఎంతమంది వచ్చినప్ప‌టికీ జ‌గ‌న్ ఒంటరిగానే పోరాడతారని ధీమా వ్య‌క్తం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉంటే కోటీశ్వరులకు లబ్ధి కలుగుతుందనే ఆయా పార్టీలు చంద్రబాబు మాట వింటున్నాయని నారాయ‌ణ స్వామి చెప్పుకొచ్చారు.

మ‌రోవైపు, ఈ రోజు ఉదయం వీఐపీ దర్శన సమయంలో ఏపీ మంత్రి ఆళ్ల నాని, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం స్వామి, ప‌లువురు ప్ర‌ముఖులు కూడా శ్రీ‌వారిని ద‌ర్శించుకుని మొక్కులు చెల్లించుకొన్నారు. కాగా, తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టికే సోము వీర్రాజు వివ‌ర‌ణ ఇచ్చిన విష‌యం తెలిసిందే. పేదల కష్టాన్ని సీఎం జగన్ ప్రభుత్వం దోచుకుంటోందని, ఈ నేప‌థ్యంలోనే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.


More Telugu News