గుంటూరులో సెంటర్ కు దేశ ద్రోహి జిన్నా పేరా? మారుస్తారా.. కూల్చమంటారా?: బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి

  • వెంటనే పేరు మార్చేయాలని డిమాండ్
  • టీడీపీ, కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలని మండిపాటు
  • తాము అధికారంలోకి వస్తే మహాత్మా గాంధీ సెంటర్ గా మారుస్తామని వెల్లడి
దేశ విభజన, ఆ తర్వాత జరిగిన అల్లర్లలో కొన్ని లక్షల మంది చావుకు కారణమైన జిన్నా పేరును గుంటూరులో ఓ సెంటర్ కు పెట్టడమేంటని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఆ సెంటర్ కు జిన్నా పేరును తీసేయాలని, వెంటనే పేరు మార్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదంటూ ఆయన సమర్థించారు.


‘‘ఈ టవర్ పేరు జిన్నా. ఈ ఏరియా పేరు జిన్నా సెంటర్. ఇది ఏ పాకిస్థాన్ లోనో లేదు. దురదృష్టం కొద్దీ ఏపీలోని గుంటూరులోనే ఉంది. మన దేశ ద్రోహి పేరును ఇంకా అలాగే ఉంచడమా? అబ్దుల్ కలాం పేరో లేదంటే దళిత కవి గుర్రం జాషువా పేరో ఎందుకు పెట్టలేదు?’’ అంటూ సత్య కుమార్ ప్రశ్నించారు. ఆయన ట్వీట్ ను రీట్వీట్ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రం విడిపోయాక టీడీపీలు పాలన సాగించాయని, వారెందుకు పేరు మార్చలేదని ప్రశ్నించారు. ఆ ప్రాంతం పేరు మార్పుపై ఆయా పార్టీల వైఖరేంటో చెప్పాలంటూ నిలదీశారు. సత్యకుమార్ వ్యాఖ్యల్లో వివాదమేముందన్నారు. ఆ వ్యాఖ్యల్లో ఎలాంటి వివాదమూ లేదన్నారు.

జిన్నా సెంటర్ పేరును మార్చకుంటే ఆ టవర్ ను తాము కూల్చేస్తామని, పేరునూ మారుస్తామని హెచ్చరించారు. దేశ రాజధానిలోని ఔరంగజేబు రోడ్డును అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చామని, రాష్ట్ర రాజధానిలో మార్చలేమా? అని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే సెంటర్ పేరును మహాత్మా గాంధీ సెంటర్ గా మారుస్తామని చెప్పారు.


More Telugu News