ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది.. ఇది థర్డ్‌వేవ్‌కు సంకేతం: తెలంగాణ ప్రజారోగ్యశాఖ

  • ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం
  • నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలి
  • క‌రోనా నిబంధ‌న‌లు పాటించాలి
  • సంక్రాంతి తర్వాత థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశం
తెలంగాణ‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లో కూడా క‌రోనా కేసులు పెరుగుతున్నాయ‌ని తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్ట‌ర్ జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ రోజు ఆయ‌న హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశం నిర్వ‌హించి క‌రోనా కేసుల గురించి మాట్లాడారు. క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయ‌ని, ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతోందని, ఇది కరోనా థర్డ్‌ వేవ్‌కు సంకేత‌మ‌ని చెప్పారు. దాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని అన్నారు.

నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, క‌రోనా నిబంధ‌న‌లు పాటించానని చెప్పారు. సంక్రాంతి తర్వాత థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశముందని తెలిపారు. ఇప్ప‌టికే ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలకు ఒమిక్రాన్‌ వ్యాపించిందని ఆయ‌న చెప్పారు. తెలంగాణలో ఆ కేసులు పెరిగాయ‌ని తెలిపారు.

డెల్టా వేరియంట్‌ కంటే 30 రెట్ల వేగంతో ఒమిక్రాన్‌ వ్యాప్తి ఉందని, అయితే కేసుల పెరుగుదలపై ప్రజలు అప్ర‌మ‌త్తంగా ఉండాలి కానీ, భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. దేశంలో తొలి ద‌శ‌, రెండో ద‌శలో క‌రోనా విజృంభ‌ణ స‌మ‌యంలో నేర్చుకున్న పాఠాలతో ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రజ‌లు మాస్క్ ధరించాలని, అంద‌రూ వ్యాక్సిన్‌ తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. వాటి ద్వారానే ఒమిక్రాన్‌ నుంచి రక్షించుకోవచ్చని తెలిపారు.

ఒమిక్రాన్‌ సోకిన వారిలో 90 శాతం మందికి వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని ఆయ‌న చెప్పారు. రాష్ట్రంలో, దేశంలో వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలకమని తెలిపారు. గతంలో కరోనా రెండు ద‌శ‌ల్లో వ్యాప్తి జ‌రిగిన‌ప్పుడు క‌రోనాపై విజయం సాధించామని చెప్పుకొచ్చారు.

మూడో ద‌శ వ్యాప్తి సూచ‌న‌ల నేప‌థ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. అయితే, భ‌య‌ప‌డ‌కూడ‌ద‌ని, వైరస్ కన్నా భ‌య‌మే ప్రమాదకరమని ఆయ‌న చెప్పారు. అయితే, ఈ థర్డ్ వేవ్ కరోనాకు ముగింపులాంటిద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.


More Telugu News