థియేట‌ర్ల మూసివేత వివాదం: పేర్ని నానితో ఆర్.నారాయ‌ణ మూర్తి భేటీ

  • థియేట‌ర్ల మూసివేత‌పై ఇటీవ‌లే నారాయ‌ణ మూర్తి ఆవేద‌న‌
  • ఆయా అంశాల‌పై చ‌ర్చ
  • వ్య‌క్తిగ‌తంగా అడిగి తెలుసుకుంటాన‌ని వ్యాఖ్య‌
ఏపీలో సినిమా టికెట్ ధ‌ర‌ల విష‌యంలో వివాదం రాజుకున్న విష‌యం తెలిసిందే. అలాగే, సినిమా థియేట‌ర్లను కొంద‌రు స్వ‌చ్ఛందంగా మూసేస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆయా అంశాల‌పై చ‌ర్చించ‌డానికి ఏపీ మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి స‌మావేశం అయ్యారు. సినీ రంగానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై ఆయ‌న పేర్ని నానితో చ‌ర్చిస్తున్నారు.

కాగా, ఏపీలో సినిమా థియేట‌ర్ల మూసివేత‌పై ఇప్ప‌టికే ఆర్.నారాయ‌ణ మూర్తి ఆవేద‌న వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ జోక్యం చేసుకుని, సమస్యను పరిష్కరించాలని ఆయ‌న కోరారు. ఈ నేపథ్యంలో మంత్రి నానితో ఈ రోజు ఆయ‌న భేటీ అయ్యారు. కొన్ని విషయాలు వ్య‌క్తిగ‌తంగా అడిగి తెలుసుకునేందుకు తాను పేర్ని నాని వద్దకు వచ్చానని ఈ సంద‌ర్భంగా ఆర్.నారాయణమూర్తి అన్నారు.  

మ‌రోవైపు, పేర్ని నానితో తాజాగా మచిలీపట్టణంలో ఇద్దరు థియేటర్ యజమానులు కలిశారు. తమ థియేటర్లపై తీసుకున్న చర్యల గురించి చ‌ర్చించారు. అయితే, ఆ అంశంపై జిల్లా జాయింట్ కలెక్టర్ కు విజ్ఞ‌ప్తి చేసుకోవాల‌ని పేర్ని నాని వారికి చెప్పారు.

సినిమా టికెట్ల ధరలు, థియేట‌ర్ల‌లో త‌నిఖీలు, మూసివేత వంటి అంశాల‌పై పేర్ని నానితో ఇప్ప‌టికే సినిమా థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు చ‌ర్చ‌లు జ‌రిపారు. అయిన‌ప్ప‌టికీ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొర‌క‌లేదు. సినిమా టికెట్ల ధ‌ర‌ల త‌గ్గుద‌ల వ‌ల్ల సినిమా థియేట‌ర్లు మూసివేసే ప‌రిస్థితులు వ‌చ్చాయ‌ని థియేట‌ర్ల య‌జ‌మానులు అంటున్నారు. థియేట‌ర్ల మూసివేత వ‌ల్ల వాటిపై ఆధార‌ప‌డ్డ వారు ఉపాధి కోల్పోతున్నారు.


More Telugu News