నూతన సంవత్సరంలో 5జీ సేవలు పలుకరించే 13 నగరాలు ఇవే.. జాబితాలో హైదరాబాద్

  • వివరాలను ప్రకటించిన టెలికాం శాఖ
  • చెన్నై, బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాలు 
  • టెలికాం కంపెనీల ప్రయోగాత్మక పరీక్షలు
దేశంలో 5జీ సేవలు 2022లో మొదలు కానున్నాయి. 5జీ స్పెక్ట్రమ్ వేలం పూర్తి కాకుండానే సేవలు ఎలా ఆరంభమవుతాయన్న సందేహం వచ్చిందా..? నిజమే, స్పెక్ట్రమ్ వేలాన్ని కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వేలం ద్వారా కేటాయించనుంది. ఇందుకు సంబంధించి ఇంకా షెడ్యూల్ ఖరారవలేదు.

అయితే, టెలికాం కంపెనీలు 5జీ సాంకేతికత, సేవలను పరీక్షించేందుకు వీలుగా కొంత స్పెక్ట్రమ్ ను ఇప్పటికే టెలికాం శాఖ కేటాయించింది. దీని ఆధారంగా భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కొన్ని ప్రాంతాల్లో పరీక్షలు కూడా నిర్వహించాయి. ఆయా నగరాల్లో మొదట 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని టెలికాం శాఖ ప్రకటించింది. ఎందుకంటే, పరీక్షల కోసం కంపెనీలు ఎక్విప్ మెంట్ ను  ఏర్పాటు చేసుకుని ఉంటాయి కనుక సేవలను వెంటనే ఆఫర్ చేసేందుకు వీలుంటుంది. మిగిలిన ప్రాంతాలకు తర్వాత అందుబాటులోకి రానున్నాయి.

13 నగరాల జాబితాలో హైదరాబాద్ కూడా ఉంది. ఇక్కడ విజయవంతంగా 5జీ సేవలను పరీక్షించినట్టు ఎయిర్ టెల్ ఇప్పటికే ప్రకటించింది. 1800 మెగాహెర్జ్ బ్యాండ్ పై సేవలను పరీక్షించింది. చెన్నై, బెంగళూరు, పూణె, ఢిల్లీ, అహ్మదాబాద్, గాంధీనగర్, జామ్ నగర్, ముంబై, కోల్ కతా, గురుగ్రామ్, లక్నో, చండీగఢ్ నగరాల్లో కంపెనీలు పరీక్షలు నిర్వహించాయి.


More Telugu News