అంబానీ వారసుల చేతుల్లోకి ‘రిలయన్స్ సామ్రాజ్యం’.. నాయకత్వ మార్పిడిపై కసరత్తు షురూ

  • ఆకాశ్, ఈషా, అనంత్ సమర్థులు
  • రిలయన్స్ ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళతారు
  • బహుళజాతి సంస్థగా అవతరిస్తాం 
  • ముకేశ్ అంబానీ ప్రకటన
రిలయన్స్ ఇండస్ట్రీస్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. తన వారసులకు వ్యాపార సామ్రాజ్యాన్ని అప్పగించబోతున్నట్టు మొదటి సారి ఆయన ప్రకటించారు. తన తండ్రి ధీరూభాయి అంబానీ వర్ధంతిని కుటుంబ వేడుక (ఫ్యామిలీడే)గా ఏటా ముకేశ్ జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు.

‘‘ఆకాశ్, ఈషా, అనంత్ సామర్థ్యాలపై నాకు ఎటువంటి సందేహం లేదు. ధీరూభాయి అంబానీ మాదిరే వారిలోనూ మంచి చురుకుదనం, సామర్థ్యాలు ఉన్నాయి. రిలయన్స్ ను మరిన్ని ఉన్నత శిఖరాలకు వారు తీసుకెళతారు. పెద్ద కలలు, అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను సాధ్యం చేయాలంటే అది సరైన వ్యక్తులు, సరైన నాయకత్వంతోనే సాధ్యం. రిలయన్స్ లో ప్రతిభా పాటవాలు కలిగిన యువ నాయకత్వానికి కొదవ లేదు. నాయకత్వ మార్పుపై కసరత్తు జరుగుతోంది. ఇతర సీనియర్లతో కలసి దీన్ని వేగవంతం చేస్తాం’’అని ముకేశ్ అంబానీ ప్రకటించారు.

ఇక ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయంగా దిగ్గజ బహుళజాతి కంపెనీగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. క్లీన్ ఎనర్జీలో మేటి సంస్థగా అవతరిస్తుందన్నారు. రూ.18 లక్షల కోట్ల మార్కెట్ విలువతో, దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనసాగుతోంది. దీనికింద రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్, ఆయిల్, గ్యాస్, పెట్రోకెమికల్, క్లీన్, రెన్యువబుల్ ఎనర్జీ వ్యాపారాలు ఉన్నాయి. తన తండ్రి మాదిరే ముకేశ్ కూడా రిలయన్స్ ను ముక్కలు చేసి వారసులకు ఇస్తారా? లేదంటే విభజించకుండా వాటాలు కట్టబెడతారా? అన్నది చూడాల్సి ఉంది.


More Telugu News