200 వికెట్ల క్లబ్‌లోకి షమీ.. తండ్రిని గుర్తు చేసుకుని భావోద్వేగం

  • అత్యంత వేగంగా 200 వికెట్లు సాధించిన మూడో ఇండియన్ పేసర్
  • 55 టెస్టులతోనే 200 వికెట్ల క్లబ్‌లోకి
  • తన కోసం తండ్రి ఆయన జీవితాన్ని త్యాగం చేశారన్న షమీ
మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అదరగొడుతున్నాడు. సఫారీల తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన షమీ టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అంతేకాదు, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత మూడో పేసర్‌గా, మొత్తంగా ఐదో ఇండియన్‌గా రికార్డులకెక్కాడు.

ఇక షమీ కంటే ముందు కపిల్ దేవ్ 50 టెస్టుల్లో ఈ ఘనత సాధించగా, శ్రీనాథ్ 54 టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఇప్పుడు షమీ 55వ టెస్టులో ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. మూడో రోజు మ్యాచ్ ముగిసిన అనంతరం 31 ఏళ్ల షమీ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. తాను ఈ ఘనత సాధించడం వెనక తన తండ్రి సపోర్ట్ ఉందని గుర్తు చేసుకున్నాడు.

ఉత్తరప్రదేశ్‌లోని అల్మోరా జిల్లాలోని సాహస్‌పూర్‌కు చెందిన షమీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లను తయారుచేసేందుకు అవసరమైన సౌకర్యాలు తమ గ్రామంలో లేవని తెలిసినా తాను క్రికెట్‌ను ఎంచుకున్నట్టు చెప్పాడు. తండ్రి తనను ప్రతి రోజూ 30 కిలోమీటర్ల దూరంలోని కోచింగ్ క్యాంపునకు సైకిలుపై తీసుకెళ్లేవాడని గుర్తు చేసుకున్నాడు. కొడుకు తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారంటూ భావోద్వేగానికి గురయ్యాడు. షమీ తండ్రి 2017లో మరణించారు.


More Telugu News