ఢిల్లీలో రెసిడెంట్ వైద్యులపై లాఠీచార్జ్.. నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్

  • నీట్ పీజీ కౌన్సెలింగ్‌ చేపట్టాలంటూ రెసిడెంట్ వైద్యుల ఆందోళన
  • సుప్రీంకోర్టు వరకూ ర్యాలీగా వెళ్లే యత్నం
  • అడ్డుకుని లాఠీచార్జ్ చేసిన పోలీసులు
దేశవ్యాప్తంగా నేడు వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అఖిల భారత వైద్య సంఘం (ఎఫ్ఏఐఎంఏ) పిలుపునిచ్చింది. నీట్ పీజీ కౌన్సెలింగ్‌ను వెంటనే చేపట్టాలంటూ ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో రెసిడెంట్ వైద్యులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ ఆసుపత్రి నుంచి సుప్రీంకోర్టు వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలపాలని వైద్యులు నిర్ణయించారు.

దీనిని అడ్డుకున్న పోలీసులు రెసిడెంట్ వైద్యులపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఎఫ్ఏఐఎంఏ నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేయాలని రెసిడెంట్ వైద్యులకు పిలుపునిచ్చింది. ఉదయం 8 గంటల నుంచి విధులకు దూరంగా ఉండాలని కోరింది.

మరోవైపు, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రెసిడెంట్ వైద్యులపై లాఠీచార్జ్, వైద్యుల నిర్బంధాన్ని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఎఫ్ఆర్‌డీఏ) ఖండించింది. మంగళవారాన్ని ‘బ్లాక్ డే’గా ప్రకటించింది.


More Telugu News