అర్హత వుండి, సంక్షేమ ఫలాలు అందుకోని వారికి నేడు నగదు జమ చేసిన ఏపీ సీఎం జగన్!

  • రాబడి తక్కువగా ఉన్నప్పటికీ పేదలకు అండగా నిలిచే విషయంలో రాజీపడలేదు
  • కులమతాలకు అనుగుణంగా పథకాలను అందిస్తున్నాం
  • 9,30,809 మంది ఖతాల్లోకి రూ. 703 కోట్లను జమ చేసిన సీఎం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, రాబడి తక్కువగా ఉన్నప్పటికీ పేదలకు అండదండలు అందించే విషయంలో ఏమాత్రం రాజీపడలేదని ఏపీ సీఎం జగన్ అన్నారు. ప్రజలకు ఏదీ ఆపలేదని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలనేదే తమ లక్ష్యమని తెలిపారు.

కులమతాలకు, పార్టీలకు అతీతంగా లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. అందరికీ న్యాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల లబ్ధిపొందని 9,30,809 మంది ఖాతాల్లోకి జగన్ రూ. 703 కోట్లను నేడు జమ చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఆయన నిధులను జమ చేశారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ బకాయిలను కూడా కలిపి తాము చెల్లిస్తున్నామని చెప్పారు. 2019-20 రబీ సీజన్ కు గాను రూ. 9 కోట్లు జమ చేస్తున్నామని తెలిపారు. జగనన్న వసతి దీవెనకు రూ. 39 కోట్లు, జగనన్న విద్యా దీవెనకు రూ. 19 కోట్లు, వైయస్సార్ కాపు నేస్తానికి రూ. 19 కోట్లు, పొదుపు సంఘాలకు మరో రూ. 53 కోట్లు జమ చేస్తున్నామని తెలిపారు. గతంలో సంక్షేమ పథకాల కోసం పేదలు ఎదురు చూసే పరిస్థితి ఉండేదని... ఇప్పుడు ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని జగన్ చెప్పారు.


More Telugu News