'ఇంటెల్- వెల్ కమ్ టు ఇండియా' అంటూ ట్వీట్ చేసిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

  • సెమీ కండక్టర్ల తయారీకి కేంద్రం ప్రత్యేక స్కీమ్
  • అభినందించిన ఇంటెల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్
  • భారత్ కు ఆహ్వానించిన అశ్విని వైష్ణవ్
చిప్ తయారీలో ప్రపంచంలో పేరొందిన సంస్థ ఇంటెల్ భారత్ లో సెమీకండక్టర్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తితో ఉంది. కేంద్ర కేబినెట్ సెమీ కండక్టర్, డిస్ ప్లే తయారీ పరిశ్రమకు రూ.76000 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. దేశీయంగా సెమీకండక్టర్ పరిశ్రమ విస్తరణకు, దిగుమతులను తగ్గించి, స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో కేంద్ర సర్కారు ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది.

ప్రభుత్వ నిర్ణయాన్ని ఇంటెల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన రణధీర్ ఠాకూర్ అభినందించారు. ‘‘సెమీకండక్టర్ డిజైన్, తయారీకి భారత్ ప్రోత్సాహకాలు ప్రకటించడం, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ హబ్ గా చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు భారత ప్రభుత్వానికి, అశ్విని వైష్ణవ్ కు అభినందనలు. సరఫరా చైన్ లో భాగమైన.. నైపుణ్యం, డిజైన్, తయారీ, టెస్ట్, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ ఇలా అన్ని అంశాల కలయికతో ఉన్న ప్రణాళిక చూసి సంతోషిస్తున్నాను’’ అంటూ రణధీర్ ఠాకూర్ ట్వీట్ చేశారు. దీన్ని ట్యాగ్ చేస్తూ ‘ఇంటెల్-వెల్ కమ్ టు ఇండియా’ అని అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు.

ఇప్పటి వరకు దేశీయంగా సెమీకండక్టర్ల తయారీ యూనిట్లు ఏర్పాటు కాలేదు. కానీ, ఎలక్ట్రానిక్స్ తయారీ మన దేశంలో గణనీయంగా పెరుగుతోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పాటు, వాహనాలు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు చిప్ ల అవసరం ఎంతో ఉంటుంది. దీనికోసం చైనా, తైవాన్ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయంగా సామర్థ్యాలు సమకూర్చుకోవాలని మోదీ సర్కారు లక్ష్యంగా ఉంది.


More Telugu News