ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌లు, థియేట‌ర్ల వ‌ర్గీక‌ర‌ణ‌పై కమిటీ... ప్రభుత్వం ఉత్తర్వులు

  • క‌మిటీలో ఉన్న‌తాధికారులు, ఎగ్జిబిట‌ర్లు
  • ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వ‌నున్న క‌మిటీ
  • జీవో 35 ప్రకారం విక్రయిస్తే మూతే మార్గమన్న ఎగ్జిబిటర్లు  
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల వ్య‌వ‌హారంపై వైసీపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకోసం కొత్త క‌మిటీని నియ‌మించింది. ఈ మేర‌కు సంబంధిత అధికారులు ఈ రోజు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ క‌మిటీలో ఉన్న‌తాధికారులు, ఎగ్జిబిట‌ర్లు, సినీగోయ‌ర్లు ఉంటారు.

క‌మిటీలో హోం, రెవెన్యూ, పుర‌పాల‌క‌, ఆర్థిక, స‌మాచార‌, న్యాయ‌శాఖ‌, కృష్ణా జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ కూడా ఉంటార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. సినిమా థియేట‌ర్ల వ‌ర్గీక‌ర‌ణ‌, ధ‌ర‌ల‌పై క‌మిటీ ప్ర‌తిపాద‌న‌లు చేయ‌నుంది. అనంత‌రం ధ‌ర‌లపై  ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వ‌నుంది.

మ‌రోవైపు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం సినిమా టికెట్‌ ధరలు తగ్గించడంపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు స్పందించారు. జీవో 35 ప్రకారం టికెట్లు విక్రయిస్తే మూతే మార్గమని వారు మీడియాకు చెప్పారు. సినిమా థియేటర్లను వాటి యజమానులు స్వచ్ఛందంగా మూసివేస్తుండటంతో వాటిపై ఆధార‌ప‌డ్డ వేలాది మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పారు.

కరోనా విజృంభ‌ణ స‌మ‌యంలో థియేటర్లలో సినిమాల‌ ప్రదర్శన ఆగిపోయిన విష‌యం తెలిసిందేనని, ఇప్పుడిప్పుడే సినిమాల కోసం ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వస్తున్నారని అన్నారు. పండుగ‌ల సీజ‌న్‌తో పాటు పెద్ద సినిమాలు విడుద‌ల అవుతుండ‌డంతో మ‌ళ్లీ సినీ ప‌రిశ్ర‌మకు మంచి రోజులు వ‌చ్చాయ‌ని భావించామ‌ని, అయితే, ప్ర‌స్తుత ప‌రిస్థితులు మ‌ళ్లీ ఇబ్బంది పెడుతున్నాయ‌ని థియేట‌ర్ల య‌జ‌మానులు మీడియాకు చెప్పారు.

ఏపీలోని ప్రతి థియేటర్లో ప్ర‌తిరోజు 50 మంది జీవనోపాధి పొందుతున్నారని, వీరంద‌రికీ త‌క్కువ వేత‌నాలు ఉంటాయ‌ని అన్నారు. అలాగే, థియేట‌ర్ల‌లోని స్నాక్స్ వంటివి విక్ర‌యించేవారు కూడా జీవ‌నోపాధిని కోల్పోవాల్సి వ‌స్తోంద‌ని చెప్పారు. మరోపక్క, సినిమా టికెట్ల ధ‌ర‌లు, వాటిల్లో త‌నిఖీలు వంటి అంశాల‌పై నేడు సంబంధిత వ్య‌క్తుల‌తో ఏపీ స‌ర్కారు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నుంది.


More Telugu News