ఏపీలో బీజేపీని ఈ ఇద్ద‌రికి లీజుకు ఇచ్చారా? లేదా?: మంత్రి పేర్ని నాని ఫైర్

  • త‌మ‌ది జాతీయ పార్టీ అని బీజేపీ నేత‌లు మాట్లాడ‌తారు  
  • జాతీయ పార్టీకి ఓ విధానం అంటూ ఉంటుంది
  • బీజేపీ ఏపీని సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేశ్‌లకు లీజుకు ఇచ్చేశారు
  • వారిద్ద‌రు చెప్పిన‌ట్లు బీజేపీని న‌డుపుతారు
  • బీజేపీని జాతీయ పార్టీ అనాలా? ఉప ప్రాంతీయ పార్టీ అనాలా?
ఏపీలో ఈ రోజు బీజేపీ ప్ర‌జాగ్ర‌హ సభ నిర్వ‌హించ‌నుంది. విజయవాడలో మధ్యాహ్నం 2 గంటల‌ నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సభ జరగనుంది. ఇందుకోసం ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో బీజేపీపై ఏపీ మంత్రి పేర్ని నాని మండిప‌డ్డారు.

ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... 'త‌మ‌ది జాతీయ పార్టీ అని బీజేపీ నేత‌లు మాట్లాడ‌తారు. కానీ, జాతీయ పార్టీకి ఓ విధానం అంటూ ఉంటుంది. సాధార‌ణంగా జాతీయ పార్టీ కూట‌మిలో ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. అయితే, ఇక్క‌డ మాత్రం విచిత్రంగా తెలుగు దేశం పార్టీ కూట‌మిలో బీజేపీ ఉంది. ఈ బీజేపీని ఏమ‌నాలి? బీజేపీ ఏపీని సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేశ్‌కు లీజుకు ఇచ్చేశారు. వారిద్ద‌రు చెప్పిన‌ట్లు బీజేపీని న‌డుపుతారు. ఏపీలో బీజేపీని ఈ ఇద్ద‌రికి లీజుకు ఇచ్చారా? లేదా? బీజేపీని జాతీయ పార్టీ అనాలా? ఉప ప్రాంతీయ పార్టీ అనాలా?' అని పేర్ని నాని విమ‌ర్శ‌లు గుప్పించారు.
 
'మీ పాల‌సీని మాత్రం ఇక్క‌డ సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేశ్ నిర్ణ‌యిస్తారు. ఏపీలో అప్పుల‌పై బీజేపీ ఆరోప‌ణ‌లు అర్థ‌ర‌హితం. ఆర్థిక చ‌ట్టాల‌ను అతిక్ర‌మించ‌కుండా అప్పులు తెస్తుంటే ఆరోప‌ణ‌లు చేస్తారా? దేశానికి ఉన్న అప్పు ఎంత‌? బీజేపీ చేసిన అప్పు ఎంత‌?' అని పేర్ని నాని నిల‌దీశారు.

'దేశంలో మీ పార్టీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌క ముందు ఉన్న అప్పు ఎంత‌? రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌ను మ‌ళ్లీ తెస్తామ‌ని అంటున్నారు. మీరు పెడుతున్న ప్ర‌జాగ్ర‌హ స‌భ‌లో రైతుల క‌ష్టాల గురించి కూడా మాట్లాడాలి. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌పై మాట్లాడాలి. మ‌హిళ‌ల అభ్యున్న‌తి కోసం బీజేపీ ఏం చేసింది? ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై బీజేపీకి దృష్టి లేదు' అని పేర్ని నాని మండిప‌డ్డారు. బీజేపీ నేత‌లు త‌మ ప్ర‌భుత్వంపై అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న విమర్శించారు. 


More Telugu News