ప్రధాని మోదీ కారు మారింది..! మెర్సెడెజ్ మేబాక్ కు అప్ గ్రేడ్

  • దీని ఖరీదు రూ.12 కోట్లు
  • ఇటీవలే పుతిన్ పర్యటన సందర్భంగా దర్శనం
  • రక్షణ పరంగా అత్యంత పటిష్ఠమైనది
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వినియోగించే కారులో మార్పు చోటు చేసుకుంది. గత కొన్నేళ్ల నుంచి రేంజ్ రోవర్ వోగే, టయోటా ల్యాండ్ క్రూయిజర్ మోడళ్లను ఆయన వినియోగించారు. కానీ, ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి వచ్చిన సందర్భంలో హైదరాబాద్ హౌస్ వద్ద మోదీ మెర్సిడెజ్ మే బాక్ ఎస్ 650 గార్డ్ లో కనిపించారు. వీఆర్ 10 రక్షణతో వచ్చే ఈ కారు ఖరీదు సుమారు రూ.12 కోట్లు.

ఈ నూతన కారు రక్షణ పరంగా చాలా పటిష్ఠమైనది. బుల్లెట్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు పేలుడు పదార్థాల నుంచి రక్షణ కల్పించే సామర్థ్యమూ వుంది. ఎక్స్ ప్లోజివ్ రెసిస్టెంట్ వెహికల్ (ఈఆర్వీ) 2010 రేటింగ్ దీనికి ఉంది. రెండు మీటర్ల దూరంలో 15 కిలోల టీఎన్ టీ పేలుడు జరిగినా కారులోని వారికి ఏమీ కానంత బలంగా దీన్ని తయారు చేశారు. ఒకవేళ గ్యాస్ దాడి జరిగితే కారు క్యాబిన్ నుంచి ప్రత్యేకంగా ఆక్సిజన్ సరఫరా అయ్యేలా ఏర్పాటు ఉంది. పేలుడు వంటి దాడి కారణంగా దెబ్బతిన్నా కానీ పనిచేసేలా ఫ్లాట్ టైర్లు ఏర్పాటు చేశారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించగలదు.

ప్రధాని రక్షణ బాధ్యతలు ఎస్పీజీ చూస్తుంటుంది. పైగా ప్రధాని కోసం ఉద్దేశించిన కారు ఒక్కటే ఉండదు. ఆయన కాన్వాయ్ లో ఒకే మాదిరి కార్లు రెండుంటాయి. భద్రత రీత్యా ప్రధాని ఏ కారులో ప్రయాణిస్తారన్నది గోప్యంగా ఉంటుంది.


More Telugu News