రాష్ట్ర కేబినెట్ ప్రతిపాదనలను గవర్నర్ అంగీకరించాల్సిందే: సంజయ్ రౌత్

  • ఫిబ్రవరి నుంచి ఖాళీగా ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పదవి
  • స్పీకర్ ఎన్నికను నిర్వహించాలని గవర్నర్ ను కోరిన ప్రభుత్వం
  • న్యాయ నిపుణులను సంప్రదించి నిర్ణయం ప్రకటిస్తానన్న గవర్నర్
రాష్ట్ర కేబినెట్ చేసే ప్రతిపాదనలను గవర్నర్ అంగీకరించి తీరాల్సిందేనని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం తరపున ముగ్గురు మంత్రులు ఏక్ నాథ్ షిండే (శివసేన), బాలాసాహెబ్ థోరట్ (కాంగ్రెస్), ఛగన్ భుజ్ బల్ (ఎన్సీపీ)లు నిన్న గవర్నర్ ను కలిశారు. స్పీకర్ ఎన్నికకు సంబంధించి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే రాసిన లేఖను గవర్నర్ కు అందించారు.

అయితే, బాలెట్ పద్ధతిలో కాకుండా వాయిస్ ఓటింగ్ ద్వారా ఎన్నికను నిర్వహించేందుకు ఏమైనా శాసన నిబంధనలను మార్చారా? అని గవర్నర్ వారిని అడిగారు. న్యాయ నిపుణులతో సంప్రదించి తన నిర్ణయాన్ని తెలుపుతానని గవర్నర్ తెలిపారు. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ... గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చాలా చదివారని అన్నారు. ప్రజస్వామ్యంలో మరీ ఎక్కువ చదవడం కూడా మంచిది కాదని ఎద్దేవా చేశారు. ప్రజల గొంతుకను వినడమే అన్నిటికన్నా ముఖ్యమని చెప్పారు. కేబినెట్ ప్రతిపాదనలను గవర్నర్ అంగీకరించాల్సిందేనని అన్నారు.

గత ఫిబ్రవరి నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పదవి ఖాళీగానే ఉంది. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ బాధ్యతలను స్వీకరించిన నానా పటోలే స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవి ఖాళీ అయింది. రేపటితో ముగుస్తున్న శీతాకాల సమావేశాల్లోనే ఆ పదవిని భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే, గవర్నర్ రియాక్షన్ తో ఈ సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక జరిగే పరిస్థితి కనిపించడం లేదు.


More Telugu News