అయ్యప్పకు తగ్గిన ఆదాయం.! ముగిసిన మండల పూజలు.. 10 లక్షల మంది దర్శనం

  • రూ.79 కోట్ల ఆదాయం
  • మకర విళక్కు కోసం 30న తెరుచుకోనున్న ఆలయం
  • 31 నుంచి స్వాములకు దర్శనాలు
  • పంబ-ఎరుమేలి అటవీ మార్గంలో అనుమతి
శబరిమలలోని దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామిని మండల దీక్షా కాలంలో ఆదివారం నాటికి 10.35 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె.ఆనందగోపన్ ప్రకటించారు. దేవస్థానానికి రూ.78.92 కోట్ల ఆదాయం లభించినట్టు చెప్పారు.

గతేడాది మండల దీక్షా కాలంలో కరోనా నియంత్రణకు కఠిన ఆంక్షలు అమల్లో ఉండడంతో కేవలం రూ.8 కోట్ల ఆదాయం సమకూరింది. 2019లో కరోనా  రాకముందు ఆదాయం రూ.156 కోట్లు వచ్చింది. అంటే 2019 ఆదాయంతో పోలిస్తే ఈ ఏడాది వచ్చింది సగమేనని తెలుస్తోంది. కరోనా ఇప్పటికీ ఉన్నందున దీని ప్రభావం ఆదాయంపై కొనసాగుతోంది.

ఈ ఏడాది మండల దీక్షా కాలంలో రూ.31 కోట్లు అరవణ విక్రయం ద్వారా, రూ.29 కోట్లు భక్తుల రూపంలో, రూ.3.52 కోట్ల ఆదాయం అప్పం విక్రయాల రూపంలో వచ్చినట్టు ఆనందగోపన్ తెలిపారు. ఆదివారం మండల పూజ అనంతరం అయ్యప్ప దేవాలయాన్ని అర్చకులు మూసివేశారు. డిసెంబర్ 30న తిరిగి సన్నిధిని తెరుస్తారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 14న మకర విళక్కు పర్వదినం వరకు ఆలయం భక్తుల దర్శనం కోసం తెరిచి ఉంటుంది. అప్పటి వరకు స్వామికి ప్రత్యేక పూజలు జరుగుతాయి.

మకరవిళక్కు పండుగ కోసం వచ్చే భక్తుల కోసం పంబ నుంచి ఎరుమేలి వరకు సంప్రదాయ అటవీ మార్గాన్ని తెరుస్తామని దేవాదాయ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు. డిసెంబర్ 31 నుంచి భక్తులు పంబ-ముక్కుజి-ఎరుమేలి-అజుతక్కడవు మార్గంలో వెళ్లొచ్చన్నారు. ఈ మార్గంలో బృందాలుగా స్వాములను రక్షణ మధ్య పంపించనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.


More Telugu News