మూడో డోసు వ్యాక్సిన్ ఏది తీసుకోవాలన్న దానిపై వచ్చేసిన క్లారిటీ!

  • తొలి రెండు డోసులు ఏదైతే మూడో డోసూ అదే 
  • 60 ఏళ్ల పైబడి, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న 3 కోట్లమందికి ప్రికాషనరీ డోసు
  • వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొవిషీల్డ్‌దే అగ్రభాగం
  • కొవాగ్జిన్‌తో పిల్లల వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ నెమ్మదిగా ప్రారంభమవుతున్న వేళ భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దానికి అడ్డుకట్ట వేసే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వచ్చే నెల మూడో తేదీ నుంచి 15-18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు టీకాలు వేయనున్నారు. అలాగే, 60 ఏళ్లు దాటి, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న దాదాపు 3 కోట్ల మందికి మూడో డోసు (ప్రికాషనరీ డోసు) ఇవ్వనున్నారు.

ఈ నేపథ్యంలో మూడో డోసుగా ఏ వ్యాక్సిన్ వేసుకోవాలన్న సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. తొలి డోసు తీసుకున్న కంపెనీ వ్యాక్సినే వేయించుకోవాలా? లేదంటే, ఈసారి వేరే కంపెనీ వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? వంటి అనుమానాలు నెలకొన్నాయి.

ఈ అనుమానులకు నిపుణులు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. తొలి రెండు డోసులు ఏ వ్యాక్సిన్ అయితే తీసుకున్నారో, ప్రికాషనరీ డోసు కూడా అదే తీసుకోవాలని చెబుతున్నారు. దేశంలో ఇప్పటి వరకు 141 కోట్ల డోసుల పంపిణీ జరిగిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్‌దే అగ్రభాగం. మొత్తం వ్యాక్సినేషన్‌లో కొవిషీల్డ్ వాటా ఏకంగా 89 శాతం ఉండడం గమనార్హం. 60 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న దాదాపు కోటి మందికి కొవిషీల్డ్ టీకా వేయాల్సి ఉంటుందని అంచనా.

ఇక, పిల్లలకు మాత్రం కొవాగ్జిన్ టీకాతో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. జైడస్ కాడిలా అభివృద్ధి చేసిన ‘జైకోవ్-డి’కి కూడా అత్యవసర వినియోగానికి అనుమతి లభించినప్పటికీ ప్రస్తుత వ్యాక్సినేషన్ ప్రక్రియలో అది భాగం కావడం లేదు. అయితే, మిక్సింగ్ డోసులు వేసే విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే మాత్రం క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు రావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.


More Telugu News