చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం అశాస్త్రీయం: ఎయిమ్స్ నిపుణుడు సంజయ్ కె రాయ్

  • జనవరి 3 నుంచి భారత్ లో పిల్లలకు కరోనా వ్యాక్సిన్లు
  • ప్రధాని మోదీ ప్రకటన
  • ప్రయోజనం ఉండదన్న డాక్టర్ సంజయ్ కె రాయ్
  • బూస్టర్ డోసు తీసుకున్నవారికీ కరోనా సోకుతోందని వెల్లడి
జనవరి 3 నుంచి దేశంలో చిన్నారులకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ ప్రకటన చేశారు. అయితే, ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ సంజయ్ కె రాయ్ భిన్నంగా స్పందించారు. బాలలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయం అశాస్త్రీయం అని పేర్కొన్నారు. పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనమేమీ ఉండదని అభిప్రాయపడ్డారు.

డాక్టర్ సంజయ్ కె రాయ్ ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు. అయితే, చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ అందించాలన్న నిర్ణయం అమలు చేసేముందు... ఇప్పటికే పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం మొదలుపెట్టిన దేశాల నుంచి డేటా సేకరించి విశ్లేషించాలని సూచించారు.

ప్రధాని మోదీకి తాను కూడా వీరాభిమానినని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ దేశానికి నిస్వార్థ సేవలందిస్తున్నారని డాక్టర్ సంజయ్ కె రాయ్ కొనియాడారు. అయితే, పిల్లలకు కూడా వ్యాక్సిన్లు ఇవ్వాలన్న ఆయన అశాస్త్రీయ నిర్ణయం పట్ల తాను పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యానని వెల్లడించారు.

వ్యాక్సిన్ ల వల్ల కలిగే ప్రయోజనం పట్ల ఇప్పటికీ నిర్దిష్ట ఆధారాలు లేవని, అనేక దేశాల్లో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకున్నవారికి కూడా కరోనా సోకుతోందని వివరించారు. కాకపోతే, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని, మరణం ముప్పును వ్యాక్సిన్లు తగ్గిస్తాయని పేర్కొన్నారు.


More Telugu News