‘ఆర్ఆర్ఆర్’–ఒమిక్రాన్: ప్రభుత్వానికి ఆర్జీవీ ఇచ్చిన ఐడియా ఇదీ!

  • రెండు డోసుల టీకా సర్టిఫికెట్ ఉంటేనే ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్లలోకి అనుమతించాలన్న డైరెక్టర్
  • అప్పుడంతా వ్యాక్సిన్ వేయించుకుంటారని కామెంట్
  • ‘ఆర్ఆర్ఆర్’ చూడాలన్న తపన.. నిర్లక్ష్యాన్ని గెలుస్తుందన్న వర్మ
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండడంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది. పలురాష్ట్ర ప్రభుత్వాలూ ఆంక్షల బాట పట్టాయి. వ్యాక్సినేషన్ లో స్పీడ్ పెంచేసి.. బూస్టర్ డోసులూ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయిపోతోంది. అయితే, చాలా మంది మాత్రం వ్యాక్సిన్ అంటేనే వెనకడుగు వేస్తున్నారు.

అలాంటి వాళ్లంతా వ్యాక్సిన్ వేసుకునేలా జబర్దస్త్ ఐడియా ఇచ్చాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించాడు. ‘‘ఒమిక్రాన్ కు సంబంధించి ప్రభుత్వానికిచ్చేందుకు నా దగ్గర ఓ అద్భుతమైన సలహా ఉంది. రెండు డోసులు వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను చూపిస్తేనే ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్లలోకి అనుమతించండి. అప్పుడు అందరూ వ్యాక్సిన్ వేసుకుంటారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూడాలన్న తపనే.. ప్రజల నిర్లక్ష్యాన్ని జయిస్తుంది’’ అంటూ ట్వీట్ చేశాడు.  

అయితే, వర్మ అభిప్రాయంపై నెట్టింట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు గొప్ప ఐడియా అంటూ కితాబిస్తుంటే.. మరికొందరు మాత్రం చాలా చెత్త ఐడియా అంటూ తిట్టిపోస్తున్నారు. అసలు ప్రభుత్వానికి సలహా ఇస్తున్నావా? ఆర్ఆర్ఆర్ సినిమాకు నష్టం చేసే ఐడియా ఇస్తున్నావా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, వచ్చే ఏడాది జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


More Telugu News