65 రోజుల పాటు ఎక్మో చికిత్స.. కరోనాను జయించిన బాలుడు

  • భారత్ లో ఇన్ని రోజుల ఎక్మో చికిత్సతో జీవించిన వ్యక్తి ఇతడే
  • ఎక్మో పరికరంతో ఊపిరితిత్తులకు విశ్రాంతి
  • చికిత్సతో క్రమంగా పురోగతి
  • అదే సమయంలో పోషకాహారం
  • సమగ్ర వైద్యంతో ఫలితాన్ని సాధించిన కిమ్స్ వైద్య బృందం
తల్లిదండ్రులుగా తమ 12 ఏళ్ల కుమారుడిపై వారు ఆశలు కోల్పోలేదు. కరోనాతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నాకానీ, గుండె ధైర్యం కోల్పోలేదు. వైద్యులు కూడా తమ అంకిత భావాన్నీ మరువలేదు. వీరందరి ఆకాంక్షలు, కృషి ఫలించి 65 రోజుల వైద్యం తర్వాత ఆ బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. హైదరాబాద్ లోని మినిస్టర్స్ రోడ్ కిమ్స్ ఆస్పత్రి వైద్యుల కృషిని ఈ సందర్భంగా తప్పక అభినందించాల్సిందే.

యూపీ రాజధాని లక్నోకు చెందిన 12 ఏళ్ల బాలుడు (పేరు వెల్లడించలేదు) శ్వాస సమస్యతో బాధ పడుతుండడంతో మొదట స్థానికంగా ఒక ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉన్నందున అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ కిమ్స్ కు ఎయిర్ అంబులెన్స్ లో తరలించారు తల్లిదండ్రులు.

పరీక్షల్లో ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నట్లు గుర్తించిన వైద్యులు వెనో వీనస్ ఎక్మో పరికరంతో రెండు నెలల పాటు కృత్రిమంగా శ్వాస అందిస్తూ.. క్రమంగా ఆరోగ్య పరిస్థితిని కుదుటపడేలా చేశారు. వైద్యుల చికిత్సతో ఊపిరితిత్తులు క్రమంగా మెరుగవడంతో.. ఎక్మో సాయాన్ని క్రమంగా నిలిపివేశారు. దేశంలో ఎక్మో చికిత్సపై ఎక్కువ రోజుల పాటు ఉండి, ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి ఇతడేనని వైద్యులు తెలిపారు.

 ‘‘బాలుడు మా వద్దకు వచ్చినప్పుడు ఊపిరితిత్తులు గట్టిపడిపోయి, శరీరానికి ఆక్సిజన్ సరఫరా చేయలేని కండిషన్ లో ఉన్నాడు. ఎక్మో సాయంతో ఊపిరితిత్తులకు విశ్రాంతి ఇచ్చాం. దీంతో క్రమంగా మేము చేసిన చికిత్సతో ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభించాయి. తిరిగి మామూలుగా పనిచేసే స్థితికి వచ్చేశాయి’’ అని పల్మనాలజీ చీఫ్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ విజిల్ తెలిపారు. పోషకాహారాన్ని పెంచి ఇవ్వడం, ఫిజికల్ రీహాబిలిటేషన్, అడ్వాన్స్ డ్ లంగ్ రికవరీ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.


More Telugu News