ఆ వీడియోలు బయటపెడతామంటూ కేంద్రమంత్రి అజయ్‌కుమార్ మిశ్రాకు బెదిరింపులు.. రూ. 2.5 కోట్ల డిమాండ్

  • లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడిగా మంత్రి కుమారుడు
  • నాటి ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది మృతి
  • ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తమ వద్ద ఉన్నాయని బెదిరింపులు
  • అరెస్ట్ చేసిన పోలీసులు
అక్టోబరు 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో రైతులపై వాహనం దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది చనిపోయారు. రైతులపైకి దూసుకెళ్లిన ఆ వాహనం నడిపింది కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఆ ఘటనకు సంబంధిన వీడియోలు, ఇతర సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని బయటపెట్టకుండా ఉండాలంటే రూ. 2.5 కోట్లు ఇవ్వాలంటూ కొందరు వ్యక్తులు తనను ఫోన్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టు మంత్రి ఆరోపించారు. ఈ మేరకు ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నెల 17న తనకు ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు రెండున్నర కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, అడిగిన మొత్తం ఇవ్వకుంటే తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను బయటపెడతామని బెదిరించినట్టు ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) ద్వారా మంత్రికి వారు ఈ కాల్స్ చేసినట్టు గుర్తించారు. నిందితుల్లో ఇద్దరు గ్రాడ్యుయేషన్ చదువుతున్నట్టు చెప్పారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు వారికి మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.


More Telugu News