దుర్బుద్ధితో ఉన్నవారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ కరుణామయుడ్ని ప్రార్థిస్తున్నా: పవన్ కల్యాణ్

  • క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన పవన్ 
  • దైవం మానుష రూపేణా అంటూ పవన్ ప్రకటన
  • దైవపుత్రుడు ఏసు క్రీస్తు అని కీర్తించిన జనసేనాని
  • క్షమ, దయ కలిగివుండడమే క్రీస్తుపై భక్తికి తార్కాణమని వ్యాఖ్య 
రేపు (డిసెంబరు 25) క్రిస్మస్ పర్వదినం నేపథ్యంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దైవం మానుష రూపేణా అని పేర్కొంటూ... మానవునిగా జన్మించి, మానవులను ప్రేమించి, మానవులను జాగృతపరచడానికి దివికి వచ్చిన దైవపుత్రుడు ఏసుక్రీస్తు అని వివరించారు. ఏసు అవతార పురుషుడని, ఆయన జన్మదినం మానవాళికి గొప్ప పర్వదినం అని పేర్కొన్నారు. ఏసు పట్ల అచంచల విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరికీ తన తరఫున, జనసేన శ్రేణుల తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్టు ఓ ప్రకటన చేశారు.

సకల ప్రాణుల పట్ల కరుణ, ప్రేమ, సేవాభావం చూపాలని క్రీస్తు చేసిన బోధనలు ఎల్లవేళలా ఆచరణీయం అని పవన్ కల్యాణ్ తెలిపారు. క్షమ, దయ కలిగి ఉండడమే క్రీస్తుపై భక్తికి తార్కాణం అని స్పష్టం చేశారు. దుర్బుద్ధితో ఉన్నవారికి సద్బుద్ధిని, ఆశ్రిత జనులకు సుఖసంతోషాలను ప్రసాదించమని ఆ కరుణామయుడిని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు.


More Telugu News